అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్నప్పటికీ, ఆమె సాధారణ జీవనానికి తిరిగి అలవాటు పడటానికి కొంత సమయం పట్టనుంది. ఆమె జీవితం అంత ఈజీగా సాగదు. మరింత కఠినమైన అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. భూ గరవాకర్షణ లేని వాతావరణంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములకు భూమి మీద తిరిగి నడక, నిలబడి ఉండటం వంటి సాధారణ పనులు కూడా మొదట్లో కష్టంగా అనిపిస్తాయి.
అంతరిక్ష ప్రయాణం వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు బలహీనపడటంతో పాటు రక్త ప్రసరణ విధానం కూడా మారుతుంది. ఫలితంగా వారు భూమిపై సాధారణ స్థితికి వచ్చే వరకు కొన్ని ప్రత్యేక శిక్షణలు తీసుకోవాల్సి ఉంటుంది. అడుగు తడబడినా కూడా ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సునీతా విలియమ్స్ తిరిగి వచ్చాక ఆమెకు కూడా కొన్ని మార్పులు గమనించినట్లు నాసా వైద్యులు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఆమె నడకలో సమతుల్యతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు, రోదసిలో చాలా కాలం గడిపిన వ్యోమగాములు సాధారణంగా “గ్రావిటీ సిక్‌నెస్” అనే సమస్యను ఎదుర్కొంటారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణకు అలవాటు పడే వరకు వారి మెదడు, కండరాలు, రక్త ప్రసరణ వ్యవస్థ అన్నీ క్రమంగా మారిపోతాయి. ఇది పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొన్నిరోజుల సమయం పడుతుంది.
గతంలో కూడా అంతరిక్ష ప్రయాణం ముగించుకుని వచ్చిన వ్యోమగాములు ఇదే సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రముఖ కెనడియన్ వ్యోమగామి క్రిస్ హాడ్‌ఫీల్డ్ 2013లో ఐఎస్‌ఎస్‌లో తన మిషన్ ముగించుకున్నాక “భారరహిత నాలుక” అనే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు, అంటే ఆయన మాటల్లో మార్పు వచ్చి కొత్తగా మాట్లాడటం నేర్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, వ్యోమగాముల పాదాల్లో దళసరి చర్మం తొలగిపోవడం వల్ల వారి పాదాలు చాలా మృదువుగా మారతాయి, దీని వల్ల వారు నడవడంలో కొంత ఇబ్బంది పడతారు.
సునీతా విలియమ్స్ వంటి వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చాక కొన్ని వైద్య పరీక్షలు, ఫిజియోథెరపీ వంటి ప్రత్యేకమైన చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎముకలు మళ్లీ బలంగా మారేందుకు, కండరాలు తిరిగి బలపడేందుకు వారిని ప్రత్యేకమైన వ్యాయామాలకు అనుసంధానిస్తారు. అయితే, దీన్ని ఓ సాధారణ పరిణామంగా నాసా వైద్యులు పేర్కొంటున్నారు. భూమి మీద తిరిగి పూర్తిగా స్థిరపడేందుకు ఆమె కొన్నివారాలు సమయం తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఇది వ్యోమగాములందరికీ సహజమే అనేలా వారికి మనోధైర్యం కలిగిస్తారు. ఇక సునీతకు ఇదివరకే అనుభవం ఉండడం వల్ల ఆమె తొందరాగానే ఈ చాలెంజ్ లను పూర్తి చేసే అవకాశం ఉంది.