పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్ వల్లే పాక్ ఊహించని నష్టాన్నీ ఎదుర్కొంది. ఎన్నో ఏళ్ళ తరువాత అవకాశం దొరికినప్పటికి భద్రత సమస్య కారణాల వలన టీమిండియా ఆటగాళ్లను భారత ప్రభుత్వం ఆ దేశానికి పంపలేదు. దీంతో భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో నిర్వహించారు. దానికి తోడు పాకిస్థాన్ వరుస ఓటములు మరింత దెబ్బ కొట్టాయి. ఒక సేమి ఫైనల్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే జరిగింది.
అసలైతే పాకిస్తాన్ ఈ మెగాటోర్నమెంట్ ప్లాన్ ప్రకారం నిర్వహించకపోవడం వల్ల రూ. 869 కోట్ల మేర నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. మొత్తం మూడు వేదికల అప్‌గ్రేడ్ కోసం పాకిస్తాన్ రూ. 18 బిలియన్లను ఖర్చు చేయగా, టికెట్ అమ్మకాలు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా మాత్రం తక్కువ ఆదాయం వచ్చింది. అంతేగాక, ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు లీగ్ మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే స్వదేశంలో ఆడింది. భారత్ మ్యాచ్ దుబాయ్ లో జరుగగా, ఓటమితో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఈ భారీ నష్టాల ప్రభావం పాకిస్తాన్ క్రికెట్‌పై తీవ్రంగా పడింది. ప్రధానంగా, జాతీయ టీ20 ఛాంపియన్‌షిప్‌లో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును ఏకంగా 90 శాతం తగ్గించారు. అలాగే రిజర్వ్ ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాన్ని 87.5 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్ల కోసం 5-స్టార్ హోటళ్ల బదులుగా సాధారణ స్థాయి హోటళ్లలో వసతి కల్పిస్తున్నారు. అయితే, పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నక్వీ ఈ నిర్ణయాన్ని తిరస్కరించి, మ్యాచ్ ఫీజులను పునఃసమీక్షించాలని బోర్డును ఆదేశించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో వచ్చిన ఈ ఆర్థిక భారం పాక్ క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళనగా మారింది. గతంలో కూడా పీసీబీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. కానీ, ఇప్పుడు దీనికి తోడు తమ జట్టు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన చేయకపోవడం మరింత ఒత్తిడిని పెంచింది. ఇప్పటికే తమ హోం సిరీస్‌లు కూడా అంతంత మాత్రంగానే ఉంటుండగా, టీమిండియా లాంటి పెద్ద జట్లు పాక్‌లో ఆడడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ పరిణామాలు చూస్తుంటే, పీసీబీ పెద్ద నిర్ణయాలను తీసుకోక తప్పదు. వన్డే, టీ20 లీగ్‌ల ద్వారా ఆదాయం పెంచే దిశగా పీసీబీ యోచిస్తున్నప్పటికీ, ఇటువంటి ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడానికి మరిన్ని మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. బోర్డుకు ఆదాయ వనరులు తగ్గిపోవడంతో, వచ్చే రోజుల్లో పాక్ క్రికెట్ గణనీయమైన మార్పులను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం కనిపిస్తోంది.