గాయమైన వెనక్కి తగ్గని రాహుల్ ద్రవిడ్

టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌ టీమ్ కు హెడ్ కోచ్ గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ ద్రవిడ్ మరోసారి తన నిబద్ధతను ప్రదర్శించారు. బెంగళూరులో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో ఆయన కాలుకు గాయమై కాస్ట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా దాన్ని లెక్కచేయకుండా జైపూర్‌లో జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 ప్రాక్టీస్ క్యాంప్‌కి కర్రల సహాయంతో హాజరయ్యారు.

సోషల్ మీడియాలో ఆయనను చూసిన ఫ్యాన్స్‌ తెగ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ద్రవిడ్ గాయంతో ఉన్నప్పటికీ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ, యువ క్రికెటర్లకు సూచనలు ఇస్తూ కనిపించారు. ముఖ్యంగా రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్‌లతో కలిసి ప్రత్యేకంగా పనిచేశారు. ఆటగాళ్లతో సమయాన్ని గడుపుతూ, తన అనుభవాన్ని పంచుకోవడం అతని కోచింగ్‌ శైలిని హైలైట్ చేసింది. 2011-2015 మధ్య రాజస్థాన్ రాయల్స్‌ తరపున ఆడిన ద్రవిడ్, తర్వాత 2014లో జట్టు మెంటర్‌గా మారారు.

ఇటీవల తన చిన్న కుమారుడు అన్వయ్‌తో కలిసి బెంగళూరులో ఓ క్లబ్ టోర్నీలో ఆడిన ద్రవిడ్, సెమీ ఫైనల్లో గాయపడ్డాడు. అయినా బలమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి, జట్టుకు తన వంతు సహాయం చేశాడు. గాయం కారణంగా ఫీల్డ్‌ను వీడాల్సి వచ్చినా, ద్రవిడ్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మళ్లీ మైదానంలో కనిపించడం అభిమానులకు సంతోషకరమైన విషయంగా మారింది.

రాజస్థాన్ రాయల్స్ 2025 ఐపీఎల్ సీజన్‌ను మార్చి 23న హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మొదలుపెట్టనుంది. 2008లో టైటిల్ గెలుచుకున్న ఈ ఫ్రాంచైజీ, 2022లో మరోసారి ఫైనల్‌ చేరింది. గత ఏడాది లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచినా, క్వాలిఫయర్‌ 2లో ఎస్ఆర్‌హెచ్‌ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు, ద్రవిడ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ మరింత బలంగా ముందుకు సాగుతుందా అనేది ఆసక్తిగా మారింది.