భారత క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ కూడా బెట్టింగ్ మాఫియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మరింత భారీ స్థాయిలో బెట్టింగ్ ముఠాలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌పై రూ.5000 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. బుక్‌మేకర్లు భారత జట్టును ఫేవరెట్‌గా భావిస్తూ భారీగా డబ్బులు పెట్టుబడిగా పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ వ్యవహారంలో అండర్‌వరల్డ్ మాఫియా ప్రమేయం ఉందని స్పష్టమవుతోంది.
దావూద్ ఇబ్రహీం ‘D కంపెనీ’ ప్రధానంగా ఈ బెట్టింగ్ వ్యవస్థను కంట్రోల్ చేస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీలో ఐదుగురు పెద్ద బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు సెమీ ఫైనల్స్ లో భారీ స్థాయిలో లావాదేవీలు జరిపినట్లు తేలింది. ముఖ్యంగా ప్రవీణ్ కొచ్చర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు కీలక వ్యక్తులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. వీరు లైవ్ బెట్టింగ్ నిర్వహిస్తూ ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల ద్వారా డీల్ చేస్తున్నట్లు గుర్తించారు.
ఆన్‌లైన్‌తో పాటు, ఆఫ్‌లైన్ బెట్టింగ్ కూడా ఈ ముఠాలు నిర్వహిస్తున్నాయి. ఫోన్ కాల్స్ ద్వారా బెట్టింగ్ పెడుతూ, నోట్స్‌లో రికార్డింగ్ ఉంచుతారని దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా ఒక ఇంటిని రూ.35,000 కిరాయకు తీసుకుని బెట్టింగ్ ముఠా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకు రూ.40,000 లాభం పొందుతూ ఈ వ్యవస్థను దుబాయ్ నుంచి నడుపుతున్నట్లు వెల్లడైంది.
దుబాయ్‌లో నివసిస్తున్న చోటు బన్సాల్ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ ముఠాకు కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అతడు కెనడాలో ఓ బెట్టింగ్ యాప్ రూపొందించి, ఇతరులకు అద్దెకు ఇచ్చి భారీగా లాభాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మతి నగర్‌కు చెందిన వినయ్ కూడా దుబాయ్‌లో ఉంటూ స్టేడియం నుంచి నేరుగా బెట్టింగ్ రేట్లపై సమాచారం అందిస్తున్నాడట. మరోవైపు బాబీ, గోలు, నితిన్ జైన్, జీవిత్ అనే వ్యక్తులు కూడా బెట్టింగ్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
ఈ ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, క్రికెట్ బెట్టింగ్ వ్యవస్థ దుబాయ్ కేంద్రంగా కొనసాగుతుండటంతో పోలీసులకు కొంత కష్టంగా మారింది. పెద్ద స్థాయిలో అరెస్టులు చేసినప్పటికీ, అసలు నేరస్తులు విదేశాల్లో ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవడం సవాలుగా మారింది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన బెట్టింగ్ లావాదేవీలు వెలుగులోకి వస్తే మరింత మంది నిందితులను పట్టుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.