రోహిత్, కోహ్లీ, జడేజా.. BCCI జీతాల్లో మార్పులు?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికీ వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల గ్రేడ్ A+ కాంట్రాక్టులు ప్రమాదంలో ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.7 కోట్లు వేతనంగా లభిస్తోందని టాక్. కానీ, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం వారి భవిష్యత్తుపై అనుమానాలను పెంచుతోంది.

BCCI సాధారణంగా IPL ప్రారంభానికి ముందు కాంట్రాక్టుల జాబితాను ప్రకటిస్తుంది, కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యే వరకు ఆగనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగాటోర్నీలో ఈ ముగ్గురు ఎలా రానిస్తారో అనేదే కాంట్రాక్టుపై ప్రభావం చూపనుంది. మరోవైపు, జస్ప్రిత్ బుమ్రా కూడా A+ గ్రేడ్‌లో ఉన్నాడు. కానీ అతను అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడనే కారణంగా అతడి కాంట్రాక్టుపై ఎలాంటి అనుమానాలు లేవు.

BCCI ఈసారి కాంట్రాక్టుల కేటగిరీలు మాత్రమే ప్రకటిస్తుందని, కానీ వేతన వివరాలను వెల్లడించకపోవచ్చని సమాచారం. గతంలో A+ గ్రేడ్‌కు 7 కోట్లు, A గ్రేడ్‌కు 5 కోట్లు, B గ్రేడ్‌కు 3 కోట్లు, C గ్రేడ్‌కు 1 కోట్లు కేటాయించారు. ఇక ప్రతీ మ్యాచ్ ఫీజులు అదనంగా ఉంటాయి. అయితే, రోహిత్, కోహ్లీ, జడేజా A+ కేటగిరీలో కొనసాగుతారా లేదా ఇతర కేటగిరీల్లోకి దిగజారతారామ్అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక శ్రేయస్ అయ్యర్ గతంలో ఫిట్నెస్ కారణంగా కాంట్రాక్టుకు దూరంగా ఉన్నా, ఈసారి అతను టాప్ జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని అద్భుత ప్రదర్శన, దేశవాళీ క్రికెట్‌లో అతడి ఫామ్ బలమైన కారణాలుగా మారాయి. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే, ఈ టోర్నీ తర్వాత అతను తన భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయం కాంట్రాక్టుపై ప్రభావం చూపనుంది. ఇక BCCI కొత్త కాంట్రాక్టు జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.