భారత్‌లో ప్రమాద ఘంటికలు… టాప్-3లో స్థానం!

భారతదేశంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించిందని తాజా నివేదికల్లో వెల్లడైంది. 2024లో ఏకంగా 111 AQI స్కోర్‌తో భారత్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 140 AQIతో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, 115 AQIతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. దీనితో భారతదేశం కూడా అత్యంత కాలుష్య ప్రభావిత దేశాల జాబితాలో స్థానం సంపాదించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఇదే సమయంలో, అత్యంత కలుషిత నగరాల జాబితాలో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. 169 AQIతో ఢిల్లీ ప్రపంచంలోనే అధిక కాలుష్య స్థాయిని కలిగిన నగరంగా నిలవడం తీవ్రవాదంగా మారింది. గ్రేటర్ నోయిడా (166 AQI), నోయిడా (161 AQI), ఘాజియాబాద్ (159 AQI), ఫరీదాబాద్ (154 AQI), గురుగ్రామ్ (153 AQI) నగరాలు కూడా అత్యంత కాలుష్యమైన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. కాలుష్యం తీవ్రంగా ఉన్న నగరాల్లో దక్షిణ భారతదేశం కొంతవరకు తక్కువ ప్రమాద స్థాయిలో ఉన్నా, భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.

వాహన కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాల వల్ల వచ్చే దుమ్ము, పొల్యూషన్ నియంత్రణలో ఉన్న లోపాలు కలసి దేశాన్ని ప్రమాదకర స్థితికి తీసుకువెళ్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని నగరాల్లో వాయు నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో కీలకంగా మారింది.