మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తల వెంట్రుకలు ఒక్కసారిగా రాలిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి 18 గ్రామాల్లో 279 మందిని ప్రభావితం చేసింది. ఆడవారు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ ఈ సమస్యతో సతమతమవుతుండగా, అసలు కారణం ఏమిటో అర్థం కాక కొన్నాళ్ళు ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ప్రభావితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలను సేకరించి పరిశీలించిన వైద్య నిపుణులు అసలు సమస్యను గుర్తించారు. ఆ జిల్లాలో వినియోగిస్తున్న గోధుమల్లో అధిక స్థాయిలో సెలీనియం ఉన్నట్టుగా తేలింది. పంజాబ్, హర్యానా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల్లో సాధారణ స్థాయికి 600 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని, ఈ గోధుమలను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడిందని పరిశోధకులు తెలిపారు.
సెలీనియం అనేది శరీరానికి అవసరమైన ఖనిజ పదార్థమే అయినా, మోతాదుకు మించి తీసుకుంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడమే కాకుండా తలనొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. బుల్దానా జిల్లాలో బాధితులలో ఈ లక్షణాలు కూడా కనిపించడం గమనార్హం.
అయితే, ఆ ప్రాంతంలో ఉన్న గోధుమలను మార్చడం ద్వారా సమస్య తగ్గుముఖం పట్టింది. వైద్య నిపుణుల సూచన మేరకు స్థానిక గోధుమలను ఉపయోగించడం ప్రారంభించడంతో చాలా మందిలో జుట్టు రాలే సమస్య తగ్గిపోయిందని అధికారులు వెల్లడించారు. ఒక సాధారణ ఆహార పదార్థం, మోతాదు తప్పితే ఎంతటి సమస్యను తెచ్చిపెట్టొచ్చో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates