ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సేఫ్ డ్రైవింగ్.. తదితరాలపై జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఈ విషయంలో ఆయన అందరికంటే కూడా ముందు ఉంటారని చెప్పక తప్పదు.
సేఫ్ డ్రైవింగ్ ను ఎంతగా ప్రోత్సహిస్తారో…జాగ్రత్త లేని, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే డేంజరస్ డ్రైవింగ్ అంతే స్థాయిలో ఆయన విరుచుకుపడతారు. అలాంటి ఘటనే ఒకటి గురువారం చోటుచేసుకుంది.
గురువారం ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సజ్జన్నార్…అందులో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి చేస్తున్న డేంజరస్ డ్రైవింగ్ గురించి తనదైన స్టైల్లో గడ్డి పెట్టారు. ”ఇది సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు. అంతకుమించిన ల్యాప్ టాప్ డ్రైవింగ్. మనుషులు మరీ ఇంత బిజీనా? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కారు నడిపే ఫ్రీ టైం కూడా లేదా? వర్క్ ఫ్రం హోమ్ అంటే… కారు నడుపుతూ పనిచేయడం కాదు కదా.
మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను వేరే పనులకు ఉపయోగించుకోండి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాదు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి కొలువులు చేసేవాళ్లే యథేచ్ఛగా రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై నలుగురికి అవగాహన కల్పించాల్సిన వాళ్లే… తమకేం పట్టనట్లుగా ఇలా వ్యవహరిస్తుండటం బాధాకరం. ఈ ఘటన ఇటీవల బెంగళూరు నగరంలో జరిగింది” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సజ్జన్నార్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ మహిళ తన ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని కారును డ్రైవ్ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపిస్తున్న సదరు యువతి ఓ చేతితో స్టీరింగ్ తిప్పుతూ…మరో చేతితో ల్యాప్ టాప్ ను హ్యాండిల్ చేస్తూ సాగుతున్నారు. బెంగళూరులో అసలే హెవీ ట్రాఫిక్ ఉంటున్న సంగతి తెలిసిందే.
అలాంటి ట్రాఫిక్ లో కూడా ఇలా ఎంచక్కా ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని సదరు యువతి డ్రైవింగ్ చేస్తున్న తీరును చూస్తుంటే.. నిజంగానే భయం వేస్తోంది. ఈ యువతి చేతిలోని కారు ఏమాత్రం అదుపు తప్పినా… పెను ప్రమాదం ఖాయమే కదా. అందుకే.. సజ్జన్నార్ ఆవేదనలో అర్థముందని చెప్పక తప్పదు.