టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఏపీ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయనను పోలీసులు హైదరాబాద్ నుంచ విజయవాడకు తరలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆయనను విజయవాడలోని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వల్లభనేని… గన్నవరం నుంచి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు పర్యాయాలు కూడా ఆయన టీడీపీ టికెట్ పైనే విజయం సాధించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగా… 2020లో టీడీపీ నుంచి దూరంగా జరిగి జగన్ కు దగ్గరయ్యారు.
అధికారికంగా వైసీపీలో చేరకున్నా…వైసీపీకి అనుబంధంగా కొనసాగారు. అంతేకాకుండా టీడీపీపైనా… ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపైనా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పైనా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాలు వంశీపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేలా చేశాయి.
వైసీపీలో చేరిన కారణంగా 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచే ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా…టీడీపీ శ్రేణులు ఆయనను ఓడించాయి. వంశీపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించారు. ఓటమి ఎదురు కాగానే దాదాపుగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన వంశీ… కేవలం కోర్టు కేసులకు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు.
అంతేకాకుండా తాను ఎక్కడ ఉంటున్నానన్న విషయాన్ని ఆయన తన సన్నిహితులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే హైదరాబాద్ లో వంశీ ఆచూకీని కనిపెట్టిన ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లి మరీ వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం ఏపీలో పెను కలకలమే రేపుతోందని చెప్పాలి.