వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన.. ఉత్త రాంధ్ర జిల్లాల వైసీపీ కో ఆర్డినేటర్ బాధ్యతలను.. కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు.
ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు… విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. నాయకులను సమన్వయం చేయడం కన్నబాబుకు కీలకం కానుంది.
గతంలో సాయిరెడ్డి ఉన్నప్పుడు.. అందరినీ తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. దీంతో బలమైన టీడీపీ నేతలను కూడా తోసుపుచ్చి.. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖకార్పొరేషన్‌ను సాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా విశాఖలో పార్టీని కూడా బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది. అయితే.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభావంతో పార్టీ ఓటమి పాలైంది.
అయితే.. ఆ ఎన్నికల సమయానికి సాయిరెడ్డిని ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే.. వైవీ.. దూకుడు ఏమాత్రం పనిచేయకపోగా వైసీపీ తరఫున టికెట్లు దక్కని వారిని కూడా ఆయన బుజ్జగించలేక పోయారు.
ఫలితంగా ఉత్తరాంధ్రలో దిగ్గజ నాయకులు కూడా ఓడిపోయారు. కట్ చేస్తే.. తాజాగా కన్నబాబుకు ఉత్తరాంధ్ర పగ్గాలు అప్పగించడం ద్వారా కాపులను మచ్చిక చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఇది విజయనగరం, విశాఖలను కూడా శాసిస్తోంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాలకు ఇక్కడ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
అయితే.. అదేసమయంలో రాజకీయంగా వైరుధ్యాలు ఎక్కువగా ఉన్న ఈ మూడు జిల్లాల్లో కురసాల ఏమేరకు నెట్టుకువ స్తారన్నది చూడాలి. సౌమ్యుడు కావడంతో ఆయన వైసీపీ నాయకులను ఒకే తాటిపైకి తీసుకువస్తారో లేదో అన్నది చూడాలి.