లోకేశ్ తో వేగేశ్న భేటీ… విశాఖపై సిఫీ ఆసక్తి

కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7 నెలల్లోనే ఏపీకి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాప్ టెక్ కంపెనీ ఏపీకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఫార్చూన్ టాప్ 500 కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సిఫీ టెక్ కంపెనీ.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు సిఫీ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న బుధవారం అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తో ఆయన భేటీ అయ్యారు.

ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై లోకేశ్, వేగేశ్నల మధ్య కీలక చర్చ జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు… ఏపీలో టెక్నాలజీ రంగంలో సమృద్ధిగా ఉన్న మానవ వనరులు, ఏపీకి పెట్టని కోటగా ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై వేగేశ్నకు లోకేశ్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాకుండా కొత్త రాష్ట్రంగా ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహం తదితరాలను కూడా ఆయనకు లోకేశ్ వివరించారు. సుదీర్ఘంగా సాగిన లోకేశ్ ప్రజెంటేషన్ పట్ల వేగేశ్న సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వేగేశ్న మాట్లాడుతూ… ఏపీలోని విశాఖలో తమ సంస్థకు చెందిన డేటా సెంటర్ ను ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు విశాఖ సరి అయిన ప్రదేశమన్న లోకేశ్ ప్రతిపాదనల పట్ల కూడా వేగేశ్న సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇప్పటికే టీసీఎస్ తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. టీసీఎస్ తో పాటు త్వరలోనే విశాఖకు ప్రఖ్యాత ఐటీ కంపెనీలు కూడా రానున్న విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. సిఫీ నుంచి కూడా భారీ పెట్టుబడులనే ఆశిస్తున్నట్లు లోకేశ్ చెప్పగా… అందుకు వేగేశ్న సానుకూలంగా స్పందించారు.