ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ బతుకు పోరాటమే. ఎంత బతుకు పోరాటమైనా ప్రాణాలు ఉంటేనే కదా. నిజమే… మేనిలో ప్రాణం ఉంటేనే కదా… ఎంతటి బతుకు పోరాటమైనా ముందుకు సాగేది. ఎవరి ఆలోచనల్లో వారు అలా ముందుకు సాగుతూ ఉండగా… వారు ప్రయాణిస్తున్న రైలుతో అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయంటూ ఓ పుకారు వారిని హడలెత్తించింది.

అంతే… ప్రాణాలు కాపాడుకునే క్రమంలో పరుగులు పెడుతున్న రైలు నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని దూకేశారు. ప్రాణాలు కాపాడుకుందామని వారు ఈ సాహసానికి పూనుకున్నారు. అయితే వారిని విధి మరోలా ట్రీట్ చేసింది. ప్రాణ భయంతో రన్నింగ్ లోని ట్రైన్ లో నుంచి దూకేసిన వారిని మరో రైలు వచ్చి గుద్దేసింది. మహారాష్ట్రలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో ప్రాథమిక వార్తలు అందేసరికి 8 మంది చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

మహారాష్ట్రలోని జల్ గావ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం వైరల్ అయిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు యావత్తు దేశాన్ని వణికించాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే… నిండా ప్రయాణికులతో పరుగులు పెడుతున్న పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో ఓ చోట మంటలు అంటుకున్నాయంటూ పుకార్లు నిమిషాల్లో రైలు అంతటా వ్యాపించాయి. అంతే… ఓ బోగిలోని కొందరు వ్యక్తులు రైలును నిలిపివేసేలా చైన్ ను లాగారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై ఎప్పుడైతే స్లో అయిపోయిందో… చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క ట్రాక్ పైకి దూకేశారు.

అయితే అదే సమయంలో జనం దూకిన పట్టాలపై కర్ణాటక ఎక్స్ ప్రెస్ శరవేగంగా దూసుకువస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిందన్న భయం ఓ వైపు, చైన్ లాగడంతో పట్టాలపై కీచుమంటూ శబ్దం చేస్తూ పుష్పక్ ఎక్స్ ప్రెస్ నిలుస్తున్న వైనంతో పక్క పట్టాలపై వేగంగా దూసుకువస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ను ఎవరూ గమనించలేదు. అదే సమయంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ కూడా క్షణకాలంలో జరుగుతున్న పరిణామాలను గమనించలేకపోయారు. తన రైలును ముందుకు కదిలించారు. అంతే… పుష్పక్ ఎక్స్ ప్రెస్ నుంచి దూకిన వారిని కర్ణాటక ఎక్స్ ప్రెస్ గుద్దుకుంటూ వెళ్లిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగానే ఘోరం జరిగిపోయింది.