YD రాజు కాదు… వెంకీ అంటే ఫ్యామిలీ రాజు !

ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి ఇదెక్కడి మాస్ అనుకోవడమొకటే తక్కువ. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి టికెట్ల కోసం వస్తున్న డిమాండ్ చూసి థియేటర్ మేనేజర్ల ఫోన్లు మ్రోగుతూనే ఉన్నాయట.

అవతల పాజిటివ్ టాక్ వచ్చిన డాకు మహారాజ్ ఉన్నప్పటికీ మొదటి ఛాయస్ వెంకీ మామనే నిలవడం కొంత వరకు ఊహించిందే అయినా ఈ స్థాయి భీభత్సం మాత్రం మాటలకు అందనిది. బయటికి వచ్చిన పబ్లిక్ టాక్, రివ్యూలు అత్యధిక శాతం సానుకూలంగా ఉండటం రీచ్ పెంచుతోంది.

సినిమాలో వెంకటేష్ పేరు వైడి రాజు. కానీ చూసినవాళ్లు మాత్రం ఫ్యామిలీ రాజు అంటున్నారు. ఇందులో ఒక డైలాగు ఉంది. హీరోని ఉద్దేశించి ఒక పాత్ర వీడు ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీనే అంటాడు. అది ఇప్పుడు అతికినట్టు సరిపోతోంది.

కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసుకున్న ఏ సందర్భమైనా అదే జరుగుతోంది. ఎఫ్2, ఎఫ్ 3నే కాదు గతంలో కలిసుందాం రా, రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం లాంటివన్నీ ఆ వర్గాన్ని విపరీతంగా ఆకట్టుకున్నవే. కొన్ని సిల్వర్ జూబ్లీలు కూడా ఆడాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది వెంటనే చెప్పలేం కానీ భారీ వసూళ్లు ఖాయం.

పండగ చివరిలో వచ్చినా మొదటి ర్యాంక్ తెచ్చుకునేలా ఉన్నాడని ట్రేడ్ టాక్. ఇంకో రెండు రోజుల పాటు చాలా సెంటర్లలో టికెట్లు దొరికే పరిస్థితి లేదు. దీని ఓవర్ ఫ్లోస్ పక్క సినిమాలకు ఉపయోగపడతాయని ఎగ్జిబిటర్ టాక్. డాకు మహారాజ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ దానికి మాస్ మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది.

కానీ సంక్రాంతికి వస్తున్నాంకి అందరి అండ దొరుకుతుంది. చివరిగా ఎవరు విజేత అవుతారనేది థియేటర్ బిజినెస్, బ్రేక్ ఈవెన్, లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఓ రెండు వారాలు వేచి చూడాలి. మొత్తానికి జనాలను మరోసారి నవ్వించడంలో వైడి రాజు సూపర్ సక్సెసయ్యాడు.