స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది దేశ అత్యున్నత న్యాయస్థానం. ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది.
గతంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పున:సమీక్షించాలన్న వినతికి నో చెప్పేసింది. అంతేకాదు.. గతంలో ఈ అంశంపై ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు కనిపించలేదన్న సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. స్వలింగ వివాహాలపై గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ నరసింహ) ఇచ్చిన తీర్పును తాము క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా చెప్పిన తాజా ధర్మాసనం (జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ నరసింహ).. ‘‘అందులో చట్ట వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఈ తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదు’’ అని తేల్చేశారు.
ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించటం కుదరదని ధర్మాసనం పేర్కొంది. 2023 అక్టోబరులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించటమే కాదు.. ఒకవేళ మార్పులు చేయాలంటే.. చట్టాన్ని మార్చాల్సింది పార్లమెంటేనని స్పష్టం చేసింది. ఇక్కడే మరో విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. 2023 అక్టోబరులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును చూస్తే.. ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసింది.
న్యాయస్థానాలు చట్టాల్ని రూపొందించవని.. వారు చేసే చట్టాలకు భాష్యాల్ని చెప్పి అమలు అయ్యేలా చేస్తాయని వివరించిన సుప్రీంకోర్టు.. స్వలింగ సంపర్కులు వివక్షకు గురి కాకుండా.. వారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొంది. వారి హక్కుల్ని కాపాడాలని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసింది.
అదే సమయంలో తమ పెళ్లిళ్లకు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు ఉన్నట్లుగా స్వలింగ సంపర్కులు చెప్పుకోలేరని స్పష్టం చేసింది. మొత్తంగా ప్రత్యేక వివాహచట్టంలో తమ పెళ్లిళ్లకు చట్టబద్ధత కోసం పోరాడుతున్న స్వలింగ సంపర్కుల వాదనను సుప్రీం కోర్టు త్రోసిపుచ్చిందని చెప్పాలి.