ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలో కొన్ని రోజుల కిందట వెలుగు చూసిన డెడ్ బాడీ డోర్ డెలివరీ
ఘటన వెనుక ఆస్తి కోసం కుట్ర ఉందని పోలీసులు తేల్చారు. సొంత మరదలికే ఓ బావ భారీ స్కెచ్ గీశాడు. ఓ డెడ్ బాడీని ఇంటికి పంపించి.. ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా భయ భ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నించి.. పక్కాగా దొరికి పోయాడు. క్రైమ్ థ్రిల్లర్‌ను తలదన్నేలా సాగిన ఈ వ్యవహారం.. వారం రోజుల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు కుట్ర దారుడు దొరికిపోయినా.. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకుడు బలయ్యాడు. చివరకు ఆస్తీదక్కక.. హత్యానేరం, కుట్ర, మోసం తదితర అనేక సెక్షన్ల కింద భార్యా భర్తలు జైలు పాలయ్యారు.
ఏం జరిగింది?
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని యండగండి ప్రాంతానికి చెందిన రంగరాజుకు రేవతి, తులసి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రేవతిని సుదర్శన్ వర్మ(ఇతనికి మరో పేరు శ్రీధర్ వర్మ కూడా ఉంది)కు ఇచ్చి వివాహం చేశారు. అదేవిధంగా తులసికి కూడా మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లిళ్లు చేశారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో తులసి భర్త ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆమె తండ్రి వద్ద కు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో తండ్రి రంగరాజు.. కుమార్తెలకు ఇద్దరికీ తన ఆస్తిని సమానం గా పంచేశాడు. ఎవరి వాటా వారు తీసుకున్నారు.
అయితే.. వ్యసనాలకు బానిసగా మారిన శ్రీధర్‌వర్మ.. భార్య రేవతిలు.. తులసి ఆస్తిని కూడా సొంతం చేసుకోవాలని పక్కా ప్లాన్ వేశారు. అయితే.. దీనికి వారు అనుసరించిన మార్గం.. భయ భ్రాంతులకు గురి చేయడం
. అది కూడా నేరుగా బెదిరించో.. భయ పెట్టో కాదు.. చిత్రమైన ప్లాన్ చేశారు. ప్రస్తుతం తులసి.. తన తండ్రి రంగరాజు తనకు ఇచ్చిన ఆస్తిలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీధర్ వర్మ, రేవతిలు.. స్వచ్ఛంద సంస్థతరఫున ఇటుకలు, ఇసుక సాయం చేస్తున్నట్టు నమ్మించారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉండే వ్యక్తి.. వ్యసనాలకు బానిసైన పర్లయ్య అనే 50 ఏళ్ల వ్యక్తిని దారుణంగా చంపేసి.. ఆ డెడ్ బాడీని చెక్క పెట్టెలో పెట్టి.. తులసి నిర్మాణం చేసుకుంటున్న ఇంటికి పంపించారు.
నిర్మాణంలో ఉన్న ఇంటికి డెడ్‌బాడీ వస్తే.. అశుభం కాబట్టి..తులసి ఆ ఆస్తిని వదులుకుంటుందని.. తాము దానిని నొక్కేయాలని రేవతి, శ్రీధర్‌వర్మలు ప్లాన్ చేశారు.కానీ, కథ అడ్డం తిరిగింది. తులసి ఈ విషయాన్ని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. వారం రోజులు కష్టపడి.. ఈ కేసును ఛేదించారు. తొలుత పర్లయ్య ఆచూకీ లభించడంతో.. అక్కడి నుంచి వరుస పెట్టి.. అన్ని విచారణలు చేసి.. శ్రీధర్ వర్మను మచిలీపట్నంలో అరెస్టు చేశారు. రేవతిని ఆమె ఇంట్లోనే అరెస్టు చేశారు. అయితే.. రేవతి మాత్రం తనకు శ్రీధర్ వర్మకు సంబంధం లేదని.. ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నా.. ఆస్తికోసం.. భార్యా భర్తలు ఇద్దరూ.. డెడ్‌బాడీ సీన్ క్రియేట్ చేశారని ఎస్పీ అస్మీ తెలిపారు.