భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు, పులకేశినగర్ పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉతప్ప నిర్వహిస్తున్న సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పీఎఫ్ చెల్లింపులలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి.
కంపెనీ ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినా, ఆ మొత్తాన్ని సంబంధిత ఖాతాల్లో జమ చేయకపోవడంతో ₹23.36 లక్షల మేర మోసం జరిగినట్లు గుర్తించారు. ఈ ఆరోపణలపై డిసెంబర్ 4న పోలీసులకు పీఎఫ్ కమిషనర్ లేఖ రాశారు. నోటీసులు అందించేందుకు పోలీసులు ఉతప్ప నివాసానికి వెళ్లగా, అతను అక్కడ లేడని తెలిసింది. దీనితో పీఎఫ్ కమిషనర్ అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఈ కేసులో ఉతప్ప స్పందన ఇంకా వెలువడలేదు. రాబిన్ ఉతప్ప 2006 నుంచి 2015 వరకు భారత జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగారు. 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉతప్ప, తన కెరీర్‌లో చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, ఇప్పుడు ఈ మోసం ఆరోపణలతో ఆయన ఇమేజ్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates