డబ్బు కోసమే పంత్ ఢిల్లీ వదిలేశాడా?

ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు (రూ. 27 కోట్లకు) పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే, 2016-24 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పంత్ ను ఆ జట్టు వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పంత్ కావాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ను వదులుకున్నాడని..పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయలేదని ఆ జట్టు కోచ్ హేమంగ్ బదానీ తాజాగా బాంబు పేల్చాడు.

పంత్ డబ్బుల కోసమే ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వెళ్లాడని చెప్పాడు. తన మార్కెట్ రేట్ ఎంత ఉందో తెలుసుకునేందుకు పంత్ ఇలా ఢిల్లీని వదిలేశాడని బదానీ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను రిటైన్ చేసుకోవాలని రిటెన్షన్‌కు ఒప్పుకోలేదని, ఎంత కన్విన్స్ చేసినా మాట వినకుండా వేలంలోకి వెళ్లిపోయాడని సంచలన ఆరోపణలు చేశాడు. రిటెన్షన్ హయ్యెస్ట్ క్యాప్‌డ్ సాలరీ రూ. 18 కోట్ల కంటే ఎక్కువ పలుకుతానని పంత్ భావించాడని, అతను అనుకున్నట్లుగానే భారీ ధర పలికాడని, మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కిందని చెప్పాడు.

ఇక, పంత్ వెళ్లిపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ కూడా స్పందించింది. పంత్ కెప్టెన్సీపై ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ కు పంత్ హర్ట్ అయ్యాడని, ఎమోషనల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ అన్నారు. తమ ఫీడ్ బ్యాక్ ను పంత్ అపార్థం చేసుకున్నాడని, పంత్ కోసం ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా కూడా ప్రయత్నించామని అన్నారు. అయితే, రూ. 27 కోట్ల ధర ఎక్కువవడంతో వదిలేశామని చెప్పారు.