ఎవరీ అల్వాల్ సబితారెడ్డి? ఆమె గురించి తెలిసి బిగ్ బి ఫిదా

రియాల్టీ గేమ్ షోలకు ఒక ఇమేజ్ తీసుకొచ్చిన టీవీ షోగా కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమాన్ని చెప్పాలి. ఇప్పటివరకు ఈ షో పదకొండు సిరీస్ లను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా పన్నెండో సీజన్ ను మొదలు పెట్టారు. అయినప్పటికీ ఈ షో కు పాపులార్టీ తగ్గలేదు. తాజాగా హాట్ సీట్లోకి వచ్చారు హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సబితా రెడ్డి. ఇప్పుడామె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆమె టీచరుగా పని చేస్తున్నారు. ఆమె హాట్ సీట్ లోకి కూర్చున్న తర్వాత ఆమె స్ఫూర్తివంతమైన జీవితాన్ని చూసిన బిగ్ బీ ఫిదా అయ్యారు. భర్త మరణించిన తర్వాత తానే పిల్లల్ని పెంచి పెద్ద చేయటం.. వారికి విద్యాబుద్ధుల్ని అందించటం చూసి బిగ్ బీ ఎంతగానో కదిలిపోయారు.

పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా.. మంచిగా చదివించిన ఆమెను బిగ్ బీ పొగిడేశారు. దీనికి సంబంధించిన గేమ్ షో ఈ రోజు (మంగళవారం) రాత్రి సోనీ టీవీలో టెలికాస్ట్ కానుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి మహిళ ఈ గేమ్ షోలోకి రావటం ఒక ఎత్తు అయితే.. తన లైఫ్ స్టోరీతో బిగ్ బీని సైతం ఎమోషన్ కు గురి చేసిన ఆమె ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.