ఖలీస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలేనని మరోసారి రుజువైంది. గ్లో అండ్ మెయిల్ అనే కెనడా వార్తాపత్రికలో నిజ్జర్ హత్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ముందుగానే తెలుసన్న కథనం బయటపడటంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తత పెరిగింది. భారత్ ఈ కథనాలను తీవ్రంగా ఖండించింది.
భారత్ స్పందిస్తూ, ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్న కెనడా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత ఉత్కంఠతకు గురి చేసే ఈ కథనాలను కెనడా ప్రభుత్వం తక్షణం వివరణ ఇవ్వాలని భారత్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే కెనడా సర్కార్ త్వరితగతిన స్పందిస్తూ, నిజ్జర్ హత్య కేసులో భారత అధికారులపై నేరారోపణలకు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ప్రకటించింది.
గ్లో అండ్ మెయిల్లో వచ్చిన కథనాలు అవాస్తవాలని, ఆ సమాచారం ఊహాజనితమేనని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. గత సంవత్సరం నిజ్జర్ హత్య తర్వాత భారత ప్రభుత్వం ఏజెంట్లపై ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇప్పటి వరకు ఎటువంటి నిర్ధారిత ఆధారాలను అందించలేకపోయారు. భారత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఎలాంటి నిర్ధారణలూ లేకుండా నిఘా సమాచారం ఆధారంగా మాత్రమే ఆరోపణలు చేశానని ట్రూడో అంగీకరించడం గమనార్హం. ఈ ప్రకటనల నేపథ్యంలో, కెనడా-భారత్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కెనడా ప్రభుత్వం నుంచి అసత్య ఆరోపణల వెనుక రాజకీయ ప్రేరేపిత ఆలోచనలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఖండనీయమని, భవిష్యత్ అభివృద్ధికి ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కెనడా-భారత్ దౌత్య సంబంధాలు ఇప్పటికే సంక్లిష్టంగా ఉండగా, ఇలాంటి అసత్య వార్తలు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చే అవకాశం ఉందని.. భారత్ ఈ వ్యవహారంపై కఠిన వైఖరి చేపట్టడంతో, కెనడా ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates