ఐపీఎల్ 2025 కోసం రిటెయిన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితా ప్రకటనకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా వేలానికి సంబంధించిన అనేక రకాల ఊహాగానాలు కూడా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక అక్టోబర్ 31న ఈ జాబితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేరును జట్టు రిటెయిన్ చేస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.
అతన్ని వేలంలోకి వదలవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పంత్ రిటెన్షన్‌పై ఢిల్లీ యాజమాన్యం అంతిమ నిర్ణయం తీసుకోనుండగా, అతను వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతాడని అంటున్నారు. ఇంతలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ కోసం రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు ఉపయోగించవచ్చు. అతనికి కెప్టెన్, కీపర్ కావాల్సిన ముంబై, బెంగళూరు, పంజాబ్, కోల్‌కతా, సూపర్ జెయింట్స్ వంటి జట్లు ఆసక్తి చూపవచ్చు” అని వ్యాఖ్యానించారు.
“రాజస్థాన్, గుజరాత్ వంటి జట్లకు ముఖ్యంగా కీపర్ అవసరం. బ్యాటింగ్ లైనప్ లో కూడా హార్డ్ హిట్లర్ గా క్లిక్కయితే టీమ్ కు మరింత బలం. ఇక పంత్ వేలంలో ఉంటే అన్ని ఫ్రాంచైజీలు ప్రతిష్ఠాత్మకంగా అతన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాయి. అతని ధర రూ.25-30 కోట్ల వరకూ చేరవచ్చని నా అంచనా” అని చోప్రా అన్నారు. రిషబ్ పంత్ టీ20 ఫార్మాట్‌లో పెద్దగా సత్తా చాటకపోయినా, ఐపీఎల్‌లో అతని టాలెంట్‌కు భారీ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. “ఐపీఎల్ వేలంలోకి వస్తే అతనికి ప్రీమియం ధర రావడం ఖాయం” అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates