ఇప్పటి వరకు రైల్వేల్లో ముందస్తుగా సీట్లు రిజర్వు చేసుకునే గడువు 120 రోజులు ఉండేది. కానీ, నవంబర్ 1 నుండి ఈ గడువును 60 రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో ప్రయాణికులు ఇకపై కేవలం రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు ఈ నిర్ణయంపై వివరణ ఇస్తూ, 120 రోజుల గడువు ఉండటం వల్ల టికెట్ రద్దులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పింది.
ముఖ్యంగా 21 శాతం టికెట్లు రద్దు అవుతుండటం గమనార్హం. టికెట్లు బుక్ చేసుకున్నవారు ఆ సమయంలో ప్రయాణం చేయకపోవడం వల్ల సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంది. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోందని తెలిపింది. దీని వల్ల పలు రకాల మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే పెద్ద సంఖ్యలో సీట్లు బుక్ చేసుకొని తర్వాత అక్రమంగా అమ్మడం, లేదా ఇతర ప్రయోజనాల కోసం బ్లాక్ చేయడం వంటి చర్యలకు ఈ గడువు ఎక్కువగా ఉండటం సహకరిస్తోందని రైల్వే బోర్డు తెలిపింది.
తక్కువ గడువు నిర్ణయం వల్ల ఇలాంటి దుర్వినియోగాలను నివారించవచ్చని పేర్కొంది. 60 రోజుల గడువు నిజమైన ప్రయాణికులకు అనువుగా ఉంటుందని, తమ ప్రయాణానికి ఒకటి లేదా రెండు నెలల ముందే ప్లాన్ చేసే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా మారుతుందని బోర్డు అభిప్రాయపడింది. అదనంగా, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రత్యేక రైళ్లు సులభంగా ఏర్పాటు చేయడం కూడా సాధ్యమవుతుందని వెల్లడించింది.మ్ముఖ్యంగా పండుగలు, సెలవులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో టికెట్ల డిమాండ్ పెరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ విధానం రైల్వే శాఖకు ప్రయోజనకరంగా ఉంటుంది.