తరచూ ఏదో ఒక చిక్కుల్ని ఎదుర్కొనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు కొత్త తలనొప్పి షురూ అయినట్లే. ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు తాజాగా చేసిన ఆరోపణలు.. ఇప్పుడా సంస్థకు కొత్త ఇబ్బందులు తప్పేటట్లు లేవంటున్నారు.
ఫేస్ బుక్ ఉద్యోగిగా ఇదే తన చివరి రోజు అంటూ యువ ఇంజనీర్ ఒకరు చేసిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేయటంతోపాటు.. ఫేస్ బుక్ మీద విమర్శనాస్త్రాల్ని సంధించేందుకు బోలెడంత అవకాశాన్ని ఇస్తుండటం గమనార్హం.
ఇంతకూ ఆ ఉద్యోగి ఎవరు? అతడు చేసిన ఆరోపణలు ఏమిటన్నది చూస్తే.. సదరు ఉద్యోగి 28 ఏళ్ల యువ ఇంజనీర్ అశోక్ చంద్వానే. అతగాడి తాజా ఆరోపణ ఏమంటే.. ఫేస్ బుక్ సరైన మార్గంలో నడవటం లేదని.. ద్వేషం నుంచి సంస్థ లాభాల్ని పొందుతున్నట్లుగా అతడు పేర్కొన్నాడు.
సుమారు ఐదున్నరేళ్లుగా ఫేస్ బుక్ లో పని చేస్తున్న తనకు ఇదే ఆఖరి రోజుగా పేర్కొన్నాడు. అమెరికాలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ద్వేష భావనతో లాభం పొందాలనుకునే సంస్థలో భాగస్వామి కావటం తనకు ఇష్టం లేదని.. అందుకే జాబ్ ను వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ విషయాల్ని అతడు.. ఫేస్ బుక్ వేదికగానే వెల్లడించటం గమనార్హం.
విద్వేష సమాచారం.. అసత్య సమాచారాన్ని నియంత్రించాలని పలువురు హక్కుల ఉద్యమకారులు.. సామాజిక కార్యకర్తలు కోరినా.. ఫేస్ బుక్ అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవటం లేదన్నాడు. సంస్థ తగిన చర్యలు తీసుకోవటంపై తన నిరసనను వ్యక్తం చేసిన అతడు.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. తన మనసులోని మాటను చెప్పి సంచలనంగా మారాడు. ఇదిలా ఉంటే.. తమ సంస్థ విద్వేషం నుంచి ఎప్పుడు లాభం పొందలేదని ఫేస్ బుక్ ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు.