ఎన్టీఆర్ బర్త్ డే సాంగ్.. సంగీత దర్శకుడి అభ్యంతరం

యువ కథానాయకుల్లో విశ్వక్సేన్ తీరే వేరు. తన అత్యుత్సాహంతో, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా అతను వార్తల్లో నిలుస్తుంటాడు. విజయ్ దేవరకొండ స్టైల్‌ను అనుకరిస్తూ పాపులర్ కావడానికి ప్రయత్నించిన అతను.. ఆ తర్వాత అతణ్నే టార్గెట్ చేస్తూ ‘ఫలక్ నుమా దాస్’ ఆడియో వేడుకలో అతి చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.

దాని ప్రభావం ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా ఫలితం మీదా పడింది. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో విశ్వక్సేస్ మాటలు హద్దులు దాటుతూనే ఉన్నాయి. ఆ సంగతి వదిలిపెడితే.. తాజాగా అతను జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేశాడు.

ఒక మాస్ బీట్‌ తీసుకుని ఓవైపు ఎన్టీఆర్ ఎలివేషన్లకు ఇస్తూనే తనకు తాను కూడా బాగానే డబ్బా కొట్టుకున్నాడందులో. కొందరు ఈ వీడియో చూసి ఇది ఎన్టీఆర్‌కు ట్రిబ్యూటా.. విశ్వక్సేన్ తనకు తాను ఇచ్చుకున్న ఎలివేషనా అంటూ కౌంటర్లు కూడా వేశారు.

మొత్తానికి ఈ ట్రిబ్యూట్ సాంగ్‌కు సోషల్ మీడియాలో ఆశించిన స్పందన అయితే రాలేదు. అది చాలదన్నట్లు ఈ పాట చుట్టూ ఓ వివాదం కూడా ముసురుకుందిప్పుడు. ఈ పాటను కంపోజ్ చేసింది ‘ఫలక్‌నుమా దాస్’ సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ఆ సినిమా కోసమే అతనా పాటను ట్యూన్ చేసినట్లున్నాడు. ఐతే కొన్ని కారణాలతో దాన్ని పక్కన పెట్టేశారు.

ఐతే ఇప్పుడు వివేక్ అనుమతి లేకుండా విశ్వక్సేన్ ఆ పాటను ఎన్టీఆర్ కోసం వాడేశాడు. ఇది అతడికి కోపం తెప్పించింది. ఈ పాట గ్లింప్స్ చూసినప్పటి నుంచే వివేక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట. పాట రిలీజయ్యాక కూడా దీన్ని ఆపేయాలని అతను పలుమార్లు చెప్పినా విశ్వక్సేన్ పట్టించుకోలేదట.

యూట్యూబ్‌లో ఈ పాట లింక్ కింద కామెంట్ సెక్షన్లో వివేక్ స్పష్టంగా ఈ విషయాన్ని వివరించాడు. విశ్వక్ తీరును తప్పుబట్టాడు. సంగీత దర్శకుడు వద్దన్నాక కూడా విశ్వక్ ఇంత మొండిగా ఈ పాటను ఎలా రిలీజ్ చేశాడో మరి.