ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు.. ఒక క్లారిటీ

క్రికెట్ ప్రియుల అభిమాన టోర్నీ ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. లీగ్ ద‌శ‌లో ఇక మిగిలిన మ్యాచ్‌లు ఆరు మాత్ర‌మే. ఐతే ఎనిమిది జ‌ట్ల‌లో ఇప్ప‌టిదాకా ప్లేఆఫ్ బెర్తు ఖ‌రారు చేసుకున్న‌ది డిఫెండింగ్ ఛాంపియ‌న్ ముంబ‌యి మాత్ర‌మే. ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎప్పుడో ప్లేఆఫ్ రేసుకు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. మిగ‌తా ఆరు జ‌ట్లు మూడు ప్లేఆఫ్ బెర్తుల కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఈ ఆరు జ‌ట్ల‌లో బెంగ‌ళూరు, ఢిల్లీ ఏడేసి విజ‌యాల‌తో మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ రెండు జ‌ట్లూ శ‌నివారం మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఆర్‌సీబీ.. స‌న్‌రైజ‌ర్స్‌తో, ఢిల్లీ.. ముంబ‌యితో త‌ల‌ప‌డ‌బోతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ రెండూ ప్లేఆఫ్‌కు అర్హ‌త సాధిస్తాయి. ఓడితే మాత్రం ఆ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే చివ‌రి మ్యాచ్‌లో ఒక ప్లేఆఫ్ బెర్తు తేలిపోతుంది. గెలిచిన జ‌ట్టు ముందంజ వేస్తుంది. ఓడిన జ‌ట్టు నెట్ ర‌న్‌రేట్‌ను బ‌ట్టి ముందుకెళ్తుందా, నిష్క్ర‌మిస్తుందా అన్న‌ది తేలుతుంది.

బెంగ‌ళూరు చేతిలో ఓడితే స‌న్‌రైజ‌ర్స్ క‌థ ముగిసిన‌ట్లే. ఆ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు గెలిస్తే.. చివ‌ర‌గా ముంబ‌యి మ్యాచ్‌లోనూ గెల‌వాలి. ర‌న్‌రేట్ బాగుంది కాబ‌ట్టి ఈ రెండు విజ‌యాల త‌ర్వాత హైద‌రాబాద్ ముందంజ వేయ‌డానికి మెరుగైన అవ‌కాశాలున్న‌ట్లే. ఏ మ్యాచ్ ఓడినా స‌న్‌రైజ‌ర్స్ క‌థ ముగ‌స్తుంది. మ‌రోవైపు పంజాబ్‌, రాజ‌స్థాన్‌, కోల్‌క‌తా 13 మ్యాచ్‌లాడి ఆరేసి విజ‌యాల‌తో ఉన్నాయి.

త‌మ చివ‌రి మ్యాచ్‌ గెలవ‌డ‌మే కాక.. నెట్ ర‌న్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న ముందుకు వెళ్తుంది. వీటిలో కోల్‌క‌తా నెట్ ర‌న్‌రేట్ మ‌రీ దారుణంగా ఉన్న నేప‌థ్యంలో ఆ జ‌ట్టు చివ‌రి మ్యాచ్ గెలిచినా ముందుకెళ్ల‌డం సందేహ‌మే. ఈ జ‌ట్ల‌లో ప‌ర‌స్ప‌రం మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేప‌థ్యంలో ప్లేఆఫ్ బెర్తులు ఎవ‌రికి సొంత‌మ‌వుతాయో చెప్ప‌డం అంత సులువు కాదు.