అమరావతి రైతులకు జగన్ ‘వరాలు’

అమరావతి రైతులకు జగన్ ‘వరాలు’

మొత్తానికి లాంఛనం ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ సాక్షిగా ఆమోదం వేసేసింది. ఇక అమరావతి నామమాత్రపు రాజధాని అనే విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదు. కేంద్రం ఏమైనా జోక్యం చేసుకుంటుందా.. కోర్టులేమైనా అడ్డుకట్ట వేస్తాయా అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే జగన్ సర్కారు కేవలం శాసన సభను మాత్రమే అమరావతిలో పెట్టి మిగతా కార్యనిర్వాహక వ్యవస్థలన్నింటినీ విశాఖపట్నానికి తరలించడానికి రంగం సిద్ధం చేసింది. న్యాయవ్యవస్థ అంతా కర్నూలుకు తరలిపోనుంది. మరి అమరావతిని రాజధానిగా నమ్మి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించిన, అక్కడ భూముల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ల సంగతేంటి అన్నది ప్రశ్న.

ఐతే జగన్ సర్కారుకు ఎంత వరకు చిత్తశుద్ధి ఉందో ఏమో కానీ.. అమరావతి రైతులకు అన్యాయం చేయమని, తెదేపా ప్రభుత్వం హామీ ఇచ్చినదానికంటే వాళ్లకు ఎక్కువ న్యాయం, లాభం జరిగేలా చూస్తామని అంటోంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు శాసన సభ ఆమోదం పొందిన సందర్భంగా అమరావతి రైతులకు కొన్ని వరాలు ప్రకటించింది జగన్ సర్కారు. అవేంటంటే..

* రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారమే రిటర్న్ ప్లాట్లు ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తారట. ఈ అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తారట.

* రాజధాని కోసం భూములిచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూములిచ్చిన రైతులకూ రిటర్న్ ఫ్లాట్లు కేటాయిస్తారట.

* ప్రస్తుతం భూములిచ్చిన రైతులకు ఏటా కౌలు రూపంలో ఇస్తున్న మొత్తానికి అదనంగా రూ.5 వేలు ఇస్తారట. పదేళ్లకు ఇలా ఇచ్చే ఒప్పందం ఉండగా.. ఆ గడువును మరో ఐదేళ్లు పెంచుతారట.

* రాజధాని గ్రామాల్లో భూమి లేని పేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5000కు పెంచుతారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English