ఓడితే గానీ... బాబుకు తెలిసిరాలేదబ్బా

ఓడితే గానీ... బాబుకు తెలిసిరాలేదబ్బా

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఘోరంగా ఓటమిపాలైంది అనే కంటే కూడా... ఆ పార్టీ చరిత్రలో ఇంత పెద్ద ఓటమి ఎన్నడూ ఎదురు కాలేదని చెబితే బాగుంటుందేమో. ఎందుకంటే... మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే... 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లను మాత్రమే గెలిచిందంటే... ఆ ఓటమి ఏ స్థాయిదో ఇట్టే అర్థం కాక మానదు.

ఇంతటి ఘోర పరాభవవాన్ని ఎదుర్కొన్నాక... పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిజంగానే కళ్లు తెరిచినట్టున్నారు. 2014లో అధికారం దక్కడంతో అసలు పార్టీ కార్యకర్తల వంకే చూడని చంద్రబాబు... ఈ ఓటమితో కళ్లు తెరుచుకుని ఇప్పుడు కార్యకర్తలకు దగ్గరయ్యారు. ఈ లెక్కన టీడీపీకి దక్కిన ఈ ఓటమి మంచిదే అయ్యిందన్న వాదన కూడా బాగానే వినిపిస్తోంది.

2014 ఎన్నికల తర్వాత నవ్యాంధ్రకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు... అసలు పార్టీ కార్యకర్తలనే పట్టించుకోలేదన్న వాదన వినిపించింది. పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తన చుట్టూ చేరిన కోటరీ సూచనల మేరకే తీసుకున్నారు గానీ... ఆ నిర్ణయాలపై ఏనాడూ ఆయన పార్టీ కార్యకర్తలను అడిగింది లేదు.

అసలు తాను తీసుకున్న నిర్ణయాలు పార్టీకి లాభం చేస్తున్నాయా? నష్టం చేస్తున్నాయా? అన్న దిశగానూ ఆయన ఆలోచించలేదనే చెప్పాలి. ఈ క్రమంలో కోటరీ చెప్పిన మాటలనే నమ్మిన బాబు... అంతా బాగుందనే అనుకున్నారు. బాబులో కనిపించిన ఈ వైఖరితో  పార్టీ శ్రేణులు తీవ్ర అసహనానికి గురయ్యాయన్న వార్తలూ వినిపించాయి.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న వాస్తవాన్ని అసలు బాబు పట్టించుకున్న దాఖలానే లేదన్న మాట వినిపించింది. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే విషయంలోనూ కింది స్థాయి కార్యకర్తల మనోభావాలు ఏమిటన్న విషయాన్ని కూడా బాబు పట్టించుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా బాబు చూసీచూడనట్టుగానే వ్యవహరించారన్న వాదనలూ లేకపోలేదు.

ఈ క్రమంలో పార్టీ పుట్టి మునుగుతోందని కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినా కూడా చెవిటోడి ముందు శంఖం ఊదిన చందంగానే బాబు వ్యవహరించారన్న వాదనలూ లేకపోలేదు. ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోతే... కేవలం 23 సీట్లే ఇచ్చేంత తప్పు తానే చేశానని బాబు మదనపడిపోతున్నారు తప్పించి.. తాను చేసిన నిర్వాకం ఏమిటన్న విషయంపై బాబు ఆలోచించలేదనే చెప్పాలి.

అయితే ఓటమి బాబులో బాగానే మార్పు తెచ్చిందని చెప్పాలి. ఇందుకు నిదర్శనమే గురు, శుక్రవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఆయన జరిపిన పర్యటన. రెండు రోజుల పాటు జిల్లాలోనే తిష్ట వేసిన చంద్రబాబు... మొత్తం జిల్లాలోని 19 నియోజకవర్గాల నేతలతోనూ కలిసి మాట్టాడారు. అంతకంటే కూడా పార్టీ కేడర్ తో బాగానే కలిసిపోయారు. 19 నియోజకవర్గాల నుంచి వచ్చిన కేడర్ చెప్పిన విషయాలన్నింటినీ సావదానంగా విన్నారు.

గత ఎన్నికల్లో ఓటమి సరే... భవిష్యత్తులో విజయాలు దక్కించుకునేందుకు ఏం చేయాలి? అన్న దిశగా కార్యకర్తలు చేసిన సూచనలను కూడా బాబు నోట్ చేసుకున్నారు. ఇక రెండు రోజుల పాటు జిల్లాలో ఉంటే... తనకు తారసపడటానికే ఇష్టపడని పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు వ్యవహారంపైనా బాబు స్పందన కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపించిందన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా మొన్నటి ఘోర పరాభవం బాబును పూర్తిగానే మార్చేసిందన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English