సంచలన ఆర్డర్లు ఇచ్చి టూరెళ్లిన జగన్

సంచలన ఆర్డర్లు ఇచ్చి టూరెళ్లిన జగన్

ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమే అవుతుంది. రెండు నెలలకి ముందు వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎవరు ఊహించని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు సాధించి సీఎం పీఠం అధిరోహించిన జగన్ పాలనలో దూకుడుగా వెళుతూ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం అవినీతిని వెలికితీయడమే లక్ష్యంగా పని చేస్తూ నీటి ప్రాజెక్టులైనా, అమరావతి నిర్మాణమైనా ఇలా కొన్నిటిలో రివర్స్ టెండరింగ్ కి వెళుతూ తన పాలన అవినీతి లేని పాలనగా చూపించాలని అనుకుంటున్నారు. అటు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ...లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

అలాగే పాలన వ్యవహారాల్లోనే కాకుండా పార్టీ వ్యవహారాల్లో కూడా దృష్టి పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  మొదట ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడంతో...ఎవరిని నొప్పించకుండా...అన్నీ సామాజికవర్గాల సమీకరణలు చూసుకుంటూ, సీనియర్స్, జూనియర్స్ కలయికతో మంత్రివర్గ విస్తరణ కూడా చేశారు. అంతేకాదు మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్నవారు, కష్టకాలంలో తన వెంట నడిచినవారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. మొత్తం 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.

అయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి కూడా న్యాయం జరిగేలా చూసుకుంటున్నారు. అందుకే అసంతృప్త నేతల్లో  కొందరికి నామినేటెడ్ పదవులు అప్పగించారు. అలాగే మరికొందరికి ప్రభుత్వ విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ విప్ తో కలిపి మిగిలిన ఏడుగురు విప్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ విప్ కి కేబినెట్ హోదా, విప్‌లకు సహాయ మంత్రుల హోదా కల్పిస్తూ... జీఏడీ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేస్తున్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి(రాయ‌చోటి) కేబినెట్ హోదా కల్పించారు. అలాగే అసెంబ్లీలో ప్రభుత్వ విప్ లుగా నియమితులైన ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను (జ‌గ్గ‌య్య‌పేట‌) - కాపు రామచంద్రారెడ్డి (రాయ‌దుర్గం) - కోరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు) - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచ‌ర్ల‌) - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్ర‌గిరి) - బూడి ముత్యాల నాయుడు (మాడుగుల‌) - దాడిశెట్టి రాజాల (తుని) ల‌కు సహాయ మంత్రి హోదా కల్పించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English