చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు ఎవ‌రూ.. ఆయ‌నను పొగ‌డ‌డం లేద‌నే చింత ఉంది. ప్ర‌ధానంగా ఏపీలో చంద్ర‌బాబు మ‌రోసారి సీఎం కావాల్సిన అవ‌స‌రం ఎంత ఉంద‌నేది వారు చెప్ప‌డం లేదు. గ‌తంలో నెల రోజుల కింద‌ట లేదా ఆపైన‌.. ప్ర‌ధాని ఏపీకి వ‌చ్చారు. చిల‌క‌లూరిపేట‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లోనూ ఆయ‌న పాల్గొన్నారు. ఈ స‌భ‌లో చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోడీని ఆకాశానికి ఎత్తేశారు.

అనంత‌రం 20 నిమిషాలు మాట్లాడిన ప్ర‌ధాని మోడీ.. ఎక్క‌డా చంద్ర‌బాబు ను ప్ర‌శంసించ‌లేదు. క‌నీసం ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయండి అని పిలుపును కూడా ఇవ్వ‌లేదు. దీనిపై అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌లు, విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకోవ‌డం బీజేపీకి ఇష్టం కూడా లేద‌ని వైసీపీ శిబిరాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. తాజాగా ఈ బాధ నుంచి చంద్ర‌బాబుకు కేంద్ర పెద్ద‌, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా విముక్తి క‌లిగించారు.

తాజాగా అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ప్రజాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న అమిత్ షా.. త‌న ప్ర‌సంగంలో చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేశారు. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా నేరుగా ప్ర‌సంశ‌లు గుప్పించారు. అందుకే తాము చంద్ర‌బాబును క‌లుపుకొని పోతున్నామ‌న్నారు. ఏపీకి చంద్ర‌బాబు వంటి దార్శ‌నికుడు(విజ‌న‌రీ) అవ‌స‌రం ఎంతో ఉంద‌న్నారు. గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రం అభివృద్ధికి ఆమ‌డ దూరంగా ఉంద‌న్నారు. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కిచెప్పారు.

అంతేకాదు.. పోల‌వ‌రం వంటి ప్రజాప్ర‌యోజ‌న ప్రాజెక్టును పూర్తి చేసేందుకు, ప‌రిశ్ర‌మ‌లు తెచ్చేందుకు, రాజ‌ధానిని క‌ట్టేందుకు, ఉపాధి , విద్య అవ‌కాశాలు పెరిగేందుకు.. చంద్ర‌బాబు వంటి నేత‌ను ముఖ్య‌మం త్రిని చేసుకోవాల్సిన అవ‌స‌రం.. ప్ర‌జ‌ల‌కు ఉంద‌ని పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు హ‌యాంలో తాము నిశితంగా అన్నీ గ‌మ‌నించామ‌ని.. నిజాయితీ ప‌రుడ‌ని కితాబునిచ్చారు. గుజ‌రాత్‌లో తాను హోం మంత్రిగా ఉన్న‌ప్పుడు.. త‌న కుటుంబానికి చెందిన వారు హైద‌రాబాద్‌లో ఐటీ కంపెనీల్లో చేరిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఇవ‌న్నీ.. చంద్ర‌బాబు తెచ్చిన‌వేన‌న్నారు. ఇలాంటి నాయ‌కుడు సీఎం అవ్వాల‌న్నారు. మొత్తంగా షా చేసిన వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబుకు ఊపిరి ఊదిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.