పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో పోలిస్తే దీనిపై అంచనాలు చాలా ఎక్కువ. ఈ సినిమా షూటింగ్ కొంత ఆలస్యమై రిలీజ్ కూడా అనుకున్న దానికంటే లేట్ అయింది. చివరికి ఆగస్టు 15కు రిలీజ్ ఖాయం చేశారు. ఐతే ఎంత టైమ్ ఇచ్చినా చాలదు అనే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సుకుమార్‌ను చూస్తే నిర్మాతల్లో కొంత కంగారు లేకపోలేదన్నది చిత్ర వర్గాల సమాచారం.

ఆగస్టు 15కు సినిమాను రెడీ చేయగలమా లేదా అని టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం రేయింబవళ్లు టీం షూటింగ్ చేస్తోంది. ఈ నెలలోనే చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నారు. మరి ఆ టార్గెట్‌ను అందుకుంటారో లేదో తెలియదు. ఐతే షూట్ కొంచెం ఆలస్యం అయినా.. పోస్ట్ ప్రొడక్షణ్ పనులను ముందే మొదలుపెట్టి అక్కడ ఎలాంటి ఆలస్యం కాకుండా చూడాలని టీం ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా ‘పుష్ప-2’ డబ్బింగ్‌ను మొదలుపెట్టేసిందట టీం. ఈ రోజు హైదరాబాద్‌లోని ఒక డబ్బింగ్ స్టూడియోలో హీరో అల్లు అర్జున్ డబ్బింగ్ మొదలుపెట్టాడు. ముందు బన్నీ పనినే ముగించేసి ఆ తర్వాత మిగతా వాళ్ల సంగతి చూడనున్నారు. మరోవైపు సినిమాలో కొన్ని కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ పనులను కమల్ కణ్ణన్ సారథ్యంలోని టీం పర్యవేక్షిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఆ వర్క్ జరుగుతోంది.

తెలుగు డబ్బింగ్ పనులు చేస్తూనే వేర్వేరు భాషల్లో డబ్బింగ్ టీమ్స్‌ను కూడా రెడీ చేస్తున్నారట. సమాంతరంగా అక్కడ కూడా డబ్బింగ్ పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా నిమగ్నం కానున్నాడు. ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే సుకుమార్ పర్యవేక్షణలో కో డైరెక్టర్లే పూర్తి చేయబోతున్నారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయాలనే చూస్తోంది టీం.