ఏపీలో బీజేపీ నయా ప్లాన్...

ఏపీలో బీజేపీ నయా ప్లాన్...

కేంద్రంలో వరుసగా రెండో సారి కూడా అధికారం నిలబెట్టుకున్న బీజేపీ... దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి ఏపీలో ఆ పార్టీ కొత్తగా సిద్ధం చేసిన వ్యూహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీలో బలమైన నేతలున్నారని గమనించిన కమలనాథులు... వారిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు నయా వ్యూహాన్ని సిద్ధం చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బీజేపీ టార్గెట్ చేసిన టీడీపీ నేతల జాబితాలో అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల ఫ్యామిలీ, వరదాపురం సూరి తదితర హార్డ్ కోర్ టీడీపీ నేతలున్నారు. వీరిలో జేసీ బ్రదర్స్ అందరికంటే ముందుగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమవగా, ఆ తర్వాత దశల వారీగా పల్లె, వరదాపురం సూరి, చివరగా పరిటాల ఫ్యామిలీ కమలం గూటికి చేరతారట.

తాజా ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఫలితాలనే సాధించిన బీజేపీ... దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఒక్క కర్ణాటక మినహాయిస్తే... తెలంగాణలో ఓ మోస్తరు సీట్లు దక్కినా బీజేపీకి ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రంలో సింగిల్ సీటు కూడా దక్కలేదు. ఏపీలో అయితే ఆ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా ఉందనే చెప్పాలి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అండ లేకుండా ఏపీలో కమలం వికసించే ఛాన్సే లేదు. బాబుతో జట్టు కట్టిన కారణంగానే 2014 ఎన్నికల్లో ఓ నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు బీజేపీ దక్కాయి. అయితే తాజా ఎన్నికల్లో చంద్రబాబు దోస్తానా లభించని బీజేపీకి సింగిల్ సీటు రాకపోగా... ఓటింగ్ శాతం కూడా బాగా పడిపోయింది. బాబు దయ చూపితేనే ఏపీలో బీజేపీ బతికి బట్టకట్టింది. ఈ విషయాన్ని గ్రహించిన కారణంగానే ఏపీలో ఇతర పార్టీలకు చెందిన నేతలున్నా... చంద్రబాబును బలహీనం చేసేందుకే కమలనాథులు ప్రణాళికలు రచించినట్టుగా తెలుస్తోంది.

తమతో స్నేహాన్ని తెంచుకుని ధైర్యంగానే ముందుకు సాగిన బాబును చూస్తుంటే బీజేపీ నేతల కుతకుతలాడిపోతున్నారు. ఈ క్రమంలో బాబు పార్టీలోని కీలక నేతలందరినీ లాగేస్తే సరిపోతుందన్న భావనలో బీజేపీ నేతలున్నట్లుగా తెలుస్తోంది. ఆ భావనకు అనుగుణంగానే రూపొందిన ప్లాన్ ను అమలు చేసేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ను బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దింపింది. పార్టీ ఆదేశాలతో ఏపీలో వాలిపోయిన రాం మాధవ్... జేసీ బ్రదర్స్ తో పాటు పరిటాల ఫ్యామిలీ, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇలా టీడీపీలో కీలకంగా ఉన్న నేతలనంతా దశలవారీగా లాగేసి చంద్రబాబును వీలయినంతమేర బలహీనం చేసేందుకే బీజేపీ యత్నిస్తోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English