దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది
అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే రాజకీయాల్లో రంగు పడుతోంది. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె రోజులు గడుస్తున్న కొద్దీ.. పోలింగ్ డేట్ చేరువ అవుతున్న కొద్దీ.. ఒకటి కాదు.. రెండు కాదు..రోజు రోజుకూ రంగులు పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం..ఆమె వ్యవహార శైలే. మరో 10 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నేతలు అందరూ తమ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో ఉన్న విభేదాలను కూడా మరచిపోవాలని కోరుతున్నారు.
కానీ, నగరిలో మాత్రం రోజా అడగడం లేదు. పైగా.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మరింత దూరం చేసుకుంటున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపత్యంలో ఆమె నియోజకవర్గంలో సెగ మరింత పెరుగుతోంది. కీలక నాయకులు పార్టీకి, ఆమెకు కూడా దూరంగా జరుగుతున్నారు. మరి ఇది వచ్చే ఎన్నికల ఫలితాన్ని ముందుగానే వారు ఊహించి చేస్తున్నారో..లేక ఆమెపై విరక్తి చెందే ఇలా దూరమవుతున్నారో.. తెలియాలి. తాజాగా.. కీలకమైన 5 మండలాల వైసీపీ ఇన్చార్జ్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం.. రోజా వైఖరేనని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఎవరెవరు?
- శ్రీశైలం దేవస్థానం పాలకమండలి మాజీ ఛైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి. ఈయన పార్టీ కోసం, గత ఎన్నికల్లో రోజా గెలుపు కోసం పనిచేసిన మాట వాస్తవం. అయితే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవి విషయంలో రోజాతో ఏర్పడిన వివాదంతో ఆయన దూరమయ్యారు. రోజాకు టికెట్ ఇవ్వద్దన్నారు. దీంతో ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయనున్నారు. ఈయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
- ఎంపీటీసీ లక్ష్మీపతి రాజు. ఈయన కూడా కీలక నేత. స్థానికంగా రోజాకు అండగా ఉన్నారు. కానీ, ఆమె పట్టించుకోకపోవడంతో ఆయన కూడా పార్టీకి దూరమయ్యారు.
- పార్టీ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి కూడా పార్టీకి దూరమయ్యారు. తనను సస్పెండ్ చేయడం వెనుక రోజా ఉన్నారని ఆయన చెబుతున్నారు. దీంతో ఈయన కూడా రెడ్డి ఓట్లను ప్రభావితం చేయనున్నారు. వడమాలపేట టోల్ గేట్ వద్ద స్థలాలను రోజా కబ్జా చేయడాన్ని ఈయన ప్రశ్నించికొన్నాళ్ల కిందట వార్తల్లోకి ఎక్కారు. తర్వాత పార్టీలో సస్పెండ్ అయ్యారు.