బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తెలుగోడు?

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తెలుగోడు?

అమిత్ షాను మోదీ కేబినెట్లోకి తీసుకోవడంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భూపేంద్ర యాదవ్, జేపీ నడ్డాల పేర్లు తొలుత బలంగా వినిపించినప్పటికీ రెండు రోజులుగా వారి పేర్లు వెనుకబడ్డాయి. కొత్తగా మరో వ్యక్తి పేరు ఈ కీలక పదవికి వినిపిస్తోంది. అదే నిజమైతే మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి తెలుగోడు నియమితుడయ్యే అవకాశం ఉంది.

తాజాగా దిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న ఆ తెలుగోడి పేరు రాంమాధవ్. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీలో కీలకంగా ఉన్న ఈ నేత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేనప్పటికీ ఆయన పేరు జాతీయ అధ్యక్ష పదవికి వినిపిస్తుండడంతో అందరిలోనూ మరోసారి ఆసక్తి ఏర్పడింది. 1981లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన రామ్‌మాధ‌వ్.. ఆ త‌ర్వాత 2014 వ‌ర‌కు అందులోనే ప‌నిచేశారు. 2003 నుంచి 2014 వ‌ర‌కు ఆర్ఎస్‌ఎస్ అధికార ప్రతినిధిగా వ్యవ‌హ‌రించారు.

ఆ త‌ర్వాత 2014లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా ఎంపిక‌య్యారు. అప్పట్నుంచి మోడీ, అమిత్ షాల‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. బీజేపీ అంత‌ర్జాతీయ రాజ‌కీయ పార్టీల యూనియ‌న్‌లో చేర్చడంలోనూ, చైనా నిర్మించే ఒన్ బిల్ట్ ఒన్ రోడ్ కారిడార్ చ‌ర్చల విష‌యంలోనూ కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. జ‌మ్మూకాశ్మీర్‌లో పీడీపీతో సంప్రదింపులు చేసి బీజేపీ భాగ‌స్వామ్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు చొర‌వ‌చూపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రామ్ మాధ‌వ్‌ను ఎంపిక చేసేందుకు అమిత్ షా, మోదీ ఆలోచ‌న చేస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా కేబినెట్లో ఉండడంతో ఆయనకు వారసుడి ఎంపిక పార్టీకి కీలకంగా మారింది. తొలుత జేపీ నడ్డా పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయ‌న‌్ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోకపోవడంతో అధ్యక్ష బాధ్యత‌లు ఇచ్చేందుకే పక్కన పెట్టారన్న ప్రచారం జరిగింది. మరోవైపు భూపేంద్ర యాదవ్ పేరూ వినిపించింది. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఇంచార్జిగా పనిచేసిన ఆయన అక్కడ అన్ని స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకునేలా చేయగలిగారు.

అయితే.. తాజాగా వీరిద్దరికీ బదులు రాంమాధవ్‌ పేరు వినిపిస్తోంది. ఆర్‌ఎస్ఎస్‌ నుంచి గట్టి మద్దతు ఉన్న రాంమాధ‌వ్‌కు అధ్యక్ష ప‌ద‌వి ఇచ్చే అవకాశం ఉందని ఓ బీజేపీ నేత అన్నారు. 2024 నాటికి దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయాలన్న టార్గెట్‌తో ఆయనకు పదవి ఇవ్వొచ్చని భావిస్తున్నారు. రాంమాధవ్ కనుక చివరి వరకు రేసులో ఉండి పదవి సాధించుకోగలిగితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన మూడో తెలుగు వ్యక్తి అవుతారు. ఇంతకుముందు బంగారు లక్ష్మణ్, ఎం.వెంకయ్యనాయుడు ఈ పదవి చేపట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English