కేసీఆర్ ను బాగా వెనకేసుకొస్తున్నారుగా

కేసీఆర్ ను బాగా వెనకేసుకొస్తున్నారుగా

లెక్క‌లు వేసుకోకుండానే నిర్ణ‌యాలు తీసుకుంటారా?  అందునా.. ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా. అయితే.. ఆ విష‌యాల్ని ప‌ట్టించుకోకుండా స్థానికంగా త‌మ ఇబ్బందుల్ని ఏక‌రువు పెట్టాల‌ని భావించిన తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు అమిత్ షా త‌న‌దైన షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

గ‌డిచిన కొంత‌కాలంగా మోడీ స‌ర్కారు కేసీఆర్ ప్ర‌భుత్వంతో స‌న్నిహితంగా ఉండ‌టంపై తెలంగాణ క‌మ‌ల‌నాథులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే రాష్ట్రంలో పార్టీకి భారీగా న‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని షా దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విష‌యాల్ని అమిత్ షా పిచ్చ లైట్ తో తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేత‌ల గోస‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని ఆయ‌న త‌న‌దైన శైలిలో వాద‌న‌ను వినిపిస్తూ చెప్పిన మాట‌ల‌కు తెలంగాణ బీజేపీ నేత‌ల నోట మాట‌లు రాని ప‌రిస్థితి.

కొంత‌కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ స‌ర్కారుపై తాము చేసిన పోరాటాలు వృధా అయ్యాయ‌ని బీజేపీ నేత‌లు వాపోతే.. కేంద్రం.. రాష్ట్రాల మ‌ధ్య సంబంధాన్ని పార్టీ కోణంలో చూడ‌కూడ‌ద‌న్న హిత‌బోధ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌లతో బీజేపీ న‌ష్టం వాటిల్లటం ఖాయ‌మ‌న్న బీజేపీ నేత‌ల మాట‌కు.. కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేస్తే ఆప‌లేం క‌దా? అన్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని.. ముంద‌స్తుపై రాష్ట్ర స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యాన్ని వ‌దిలేసి.. క్షేత్ర స్థాయిలో మ‌న ప‌ని మ‌నం చేసుకుంటే స‌రి అన్న మాట‌లు తెలంగాణ బీజేపీ నేత‌ల్ని అవాక్కు అయ్యేలా చేశాయ‌ని చెబుతున్నారు.

కొత్త జోన‌ల్ విధానంపై అంత త్వ‌ర‌గా ఆమోదించాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న ఒక బీజేపీ నేత మాట‌కు షా బ‌దులిస్తూ.. నిర్ణ‌యాలు ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకుంటారు.. దీన్ని రాజ‌కీయంగా చూడ‌లేమంటూ తాపీగా ఇచ్చిన స‌మాధానం బీజేపీ నేత‌ల‌కు షాకిచ్చేలా చేసింది.

రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో మూడుసార్లు ప్ర‌ధాని మోడీని ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లిసిన నేప‌థ్యంలో.. ఇరువురూ ఒక్క‌టేన‌న్న భావ‌న క‌లిగింద‌ని.. ఇది పార్టీకి న‌ష్ట‌మ‌న్న టీ బీజేపీ నేత‌ల మాట‌ల‌కు బ‌దులిచ్చిన షా..  కేంద్ర‌.. రాష్ట్రం మ‌ధ్య‌నున్న స‌మ‌న్వ‌యాన్ని ఎందుక‌లాచూస్తార‌ని చెబుతూ.. భ‌విష్య‌త్తులో ఏ అవ‌స‌రం వ‌స్తుందోన‌ని వ్యాఖ్యానించిన‌ట్లుగా చెబుతున్నారు. కేంద్రం కేసీఆర్ తో స‌న్నిహితంగా ఉండ‌టం లేద‌ని.. కేసీఆరే.. కేంద్రంతో స‌న్నిహితంగా ఉంటున్నార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మంత్రాల‌యం వెళ్లే క్ర‌మంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 40 నిమిషాల పాటు ఆగిన అమిత్ షాను తెలంగాణ బీజేపీ నేత‌లు ల‌క్ష్మ‌ణ్.. కిష‌న్ రెడ్డితో స‌హా ప‌లువురు క‌లిశారు. అంతేమ‌రి.. ఒక‌సారి డిసైడ్ అయ్యాక సొంతోళ్ల‌కు సైతం షాకిచ్చేందుకు మోడీషాలు ఎంత‌లా ప్రిపేర్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు