భార‌త్ దెబ్బ‌కు పాక్ దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్‌

భార‌త్ దెబ్బ‌కు పాక్ దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్‌

ఔను. పాక్ దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంకయ్యే రీతిలో భార‌త్ దెబ్బ‌తీసింది. అకారణంగా భారత జవాన్‌ను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్‌పై బీఎస్‌ఎఫ్ ప్రతీకారం తీర్చుకుంది. భద్రతాదళాలు బుధవారం రాత్రి పాక్ ఆర్మీ పోస్టులపై మెరుపుదాడులు చేశాయి. సరిహద్దులలోని దాయాది దేశం ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసి.. 12 నుంచి 15 మంది పాకిస్థాన్ రేంజర్లను హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో అనేకమంది పాక్ జవాన్లు గాయపడినట్టు సమాచారం.

సాంబాసెక్టార్‌లో పాక్ సైన్యం బుధవారం సాయంత్రం ఏకపక్షంగా కాల్పులకు దిగింది. కవ్వింపు చర్యలేవీ లేకపోయినా, భారత సైన్యం లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్)కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రాధాపడా హజారా(50) తీవ్రంగా గాయపడ్డారు. పుట్టినరోజునాడే పాక్ కాల్పుల్లో గాయపడిన ఆయన దవాఖానలో ప్రాణాలు విడిచారు. పాక్ కాల్పుల్లో అమరుడైన హెడ్ కానిస్టేబుల్ రాధాపడా హజరా భౌతికకాయానికి జమ్ములోని బీఎస్‌ఎఫ్ హెడ్‌క్వార్టర్‌లో అధికారులు ఘన నివాళులర్పించారు. మ‌రోవైపు ఈ కాల్పుల‌ ఘటన భారత సైన్యంలో ప్రతీకారేచ్ఛను రగిలించింది. సరిహద్దుల్లో పాక్ యథేచ్ఛగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ మోర్టార్ షెల్స్, చిన్న ఆయుధాలతో దాడులు జరుపుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించిన భారత సైన్యం దిమ్మ‌తిరిగే వ్యూహాల‌తో ముందుకు సాగింది.

సరిహద్దు వెంబడి ఉన్న పాక్ పోస్టులే లక్ష్యంగా కాల్పులకు దిగింది. సుఖ్‌మల్ ప్రాంతంలో రెండు మోర్టార్ స్థావరాలను గుర్తించి రాత్రికి రాత్రే నేలకూల్చింది. ఈ దాడిలో కనీసం నాలుగు పాక్ బోర్డర్ పోస్టులతోపాటు యుద్ధసామగ్రి, సోలార్‌ప్యానెళ్లు ధ్వంసమయ్యాయి. భీకర కాల్పులతో పాకిస్థాన్ సైనిక పోస్టులపై భారత జవాన్లు విరుచుకుపడ్డారు. ఈ ఆపరేషన్‌లో 12నుంచి 15మంది పాక్ రేంజర్లు హతమైనట్టు భావిస్తున్నారు. ఆస్తి న‌ష్టం కన్నా ఎక్కువగా ఈ ఆపరేషన్‌లో పాక్ తన జవాన్లను భారీగా కోల్పోయింది అని బీఎస్‌ఎఫ్ ఐజీ రామ్‌అవతార్ వెల్లడించారు.

మరో ఘటనలో పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన ఒకరిని సరిహద్దు భద్రతాదళం ముట్టుబెట్టింది. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఏడుగంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద కంచె దూకి వచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని నిలువరించేందుకు భద్రతాదళాలు కాల్పులు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. మృతుడిని సియాల్‌కోట్ వాసిగా గుర్తించారు. కాగా ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారా అనేది నిర్ధారించుకునేందుకు గాలింపులు కొనసాగుతున్నాయి.

కాగా, భారత్-పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ తన బలగాలను అప్రమత్తం చేసింది. 200 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఏ క్షణాన్నైనా ఏమైనా జరుగవచ్చని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తన జవాన్లకు సూచించింది. గురువారం నాటి పరిణామాలతో పాటు ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో సరిహద్దు వెంబడి ఆపరేషన్ అలర్ట్‌ని ప్రకటించాం అని బీఎస్‌ఎఫ్ ఐజీ రామ్‌అవతార్ తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు