'ఆది'లో ఎల్బీ శ్రీరాంను గుర్తుచేసిన‌ మోదీజీ

'ఆది'లో ఎల్బీ శ్రీరాంను గుర్తుచేసిన‌ మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ్య‌వహారం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్ప‌డానికి వీలు కావ‌డం లేద‌న్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. ఇదేదో విప‌క్షాల‌, మోదీకి గిట్ట‌ని వారు చెబుతున్న విష‌యం కాదు. సాక్షాత్తు ఎన్డీఏ స‌ర్కారును న‌డుపుతున్న‌, మోదీ సొంత పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీలు చెబుతున్న మాట‌. అయినా ఇప్పుడేం కొంప‌లు మునిగిపోయాయ‌ని... బీజేపీ ఎంపీలు ఈ మాట చెబుతున్నారన్న విషయానికి వ‌స్తే... అస‌లు బీజేపీ ఎంపీల్లో ఈ భావ‌న క‌ల‌గ‌డానికి మోదీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే కార‌ణ‌మన్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా మోదీ త‌న‌కు తానుగానే త‌న వ్య‌వ‌హార స‌ర‌ళిపై ప్ర‌శ్న‌లు వెల్లువెత్తేలా చేసుకున్నారా? అంటే... ఈ క‌థ‌నం చ‌దివితే అవున‌నే ఒప్పుకోక త‌ప్ప‌దు మ‌రి.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా నిన్న‌టి స‌మావేశాలు ప్రారంభం కావ‌డానికి ముందుగా ఎప్ప‌టిలానే నిర్వ‌హించే బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీ జ‌రిగింది. ఈ భేటీకి మోదీనే నేతృత్వం వ‌హించారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన ఎంపీలంతా కూడా ఈ స‌మావేశానికి త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల్సిందే. ఎందుకంటే.. ప్ర‌ధాని మోదీ, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఈ నిబంధ‌న‌ను కొత్త‌గా అమ‌ల్లోకి తెచ్చారు మ‌రి. స‌రే.. ఎలాగూ పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చాం క‌దా... పార్ల‌మెంట‌రీ భేటీకి కూడా త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సిందే క‌దా అన్న భావ‌న‌తో ఎంపీలంతా అక్క‌డికి వెళ్లార‌ట‌. యధాలాపంగా త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించిన మోదీ... ఉన్న‌ట్టుండి ఎంపీలంద‌రికీ ఓ స‌రికొత్త ప్ర‌శ్న‌ను సంధించార‌ట‌.

*ప్ర‌తి రోజు తాను ఎంపీలంద‌రికీ గుడ్ మార్నింగ్ అని సందేశాలు పంపుతున్నాను క‌దా. దానికి స్పందిస్తున్న వారెంత మంది?* అని మోదీ నోట వినిపించిన స‌ద‌రు ప్ర‌శ్న‌కు బీజేపీ ఎంపీలంతా బిక్క‌చ‌చ్చిపోయార‌ట‌. ఇదెక్క‌డి గుడ్ మార్నింగ్ గోల‌రా బాబూ? అంటూ వారంతా త‌ల ప‌ట్టుకున్నార‌ట‌. ఎంపీలుగా నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యే తాము సెల్ ఫోన్ల‌కు వ‌చ్చే ప్ర‌తి మెసేజ్‌ను ఎలా చూసుకునేది అంటూ వారు ఒకింత సంక‌ట స్థితిలో ప‌డిపోయార‌ట‌. ఎంపీల బ్లాంక్ ఫేస్‌ల‌ను చూసిన మోదీ... త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ... తానే స్వ‌యంగా గుడ్ మార్నింగ్ అంటూ సందేశాలు పంపితే.. వాటికి క‌నీసం రిప్లై ఇవ్వ‌క‌పోతే ఎలాగంటూ మోదీ ప్ర‌శ్నించార‌ట‌.

త‌న గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల‌కు కేవ‌లం ఐదారుగురు ఎంపీలు మాత్ర‌మే స్పందిస్తున్నార‌ని, మిగిలిన వారు క‌నీసం తాను పంపిన మెసేజ్‌ల‌ను కూడా చూడ‌టం లేద‌ని తేలిపోయింద‌ని కూడా ఆగ్ర‌హం వ్యక్తం చేశార‌ట‌. కేవ‌లం తాను గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ మాత్ర‌మే పెట్ట‌డం లేద‌ని, ప్ర‌తి రోజు ఏదో ఒక ముఖ్య‌మైన అంశంపై మెసేజ్ పెడుతూనే ఉంటాన‌ని కూడా మోదీ చెప్పార‌ట‌. ఇక‌పై త‌న మెసేజ్‌ల‌కు స్పందించ‌క‌పోతే మాత్రం తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని బెదిరించిన చందంగా మోదీ ఎంపీలంద‌రికీ హెచ్చరిక‌లు జారీ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు