సూరత్ : లోక్ సభలో బోణి కొట్టిన బీజేపీ

అదే లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న కదా మరి అప్పుడే ఫలితం ఎలా వెల్లడయింది అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదివింది నిజమే. పార్లమెంటు ఎన్నికల్లో చాలా అరుదయిన గెలుపు భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరిపోయింది. సూరత్ ఎంపీ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వజ్రాల నగరం సూరత్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది.

దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 6 విడతల్లో మిగతా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదు శాసనసభ స్థానాలను ఏక గ్రీవంగా కైవసం చేసుకొని సంచలనం రేపింది. తాజాగా లోక్ సభ ఎన్నికల ముందే తొలి లోక్ సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకున్నది.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ స్థానానికి బీజేపీ తరుపున ముఖేష్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేష్‌ కుభానీలు బరిలో ఉన్నారు. వీరితో పాటు మరో ఏడుగురు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. అయితే వీరంతా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

స్థానిక ఎన్నికల్లో సాధారణంగా ఉండే ఇలాంటి సంఘటనలు ప్రస్తుత రాజకీయాల్లో శాసనసభ, లోక్ సభ స్థానాల పరిధిలో అరుదు, అపూర్వం అని చెప్పాలి. ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో అక్కడి బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.