ఇవాంకా వ‌స్తోంది...ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు రాకండి

ఇవాంకా వ‌స్తోంది...ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు రాకండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌజ్ సలహాదారురాలు ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న కాస్త న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపించేదిగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ నెల 28న ఇవాంకా హైదరాబాద్ వస్తుండటంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఏర్పాట్లు శృతిమించిపోతున్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆమె వచ్చిన రోజూ ఎవరూ బయటకు రావొద్దని.. ఏకంగా ప్రచారం చేస్తున్నారంటే.. భద్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఈ స్థాయిలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని చూసి హైద‌రాబాదీలు అవాక్క‌వుతున్నాయి.

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్‌లో భాగంగా ఇటు ఇవాంకా హాజ‌రుకానున్న‌హెచ్ఐసీసీలో అటు ఆమెకు విందు ఇచ్చే ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ వ‌ద్ద ఇలాంటి హెచ్చ‌రిక‌ల‌తో కూడిన స‌ల‌హాలు ఇస్తున్నారు.  ‘‘అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు. ఆ రోజు ఎవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు. అత్యవసర పనులుంటే మాకు చెప్పండి.’’ అంటూ ఫలక్‌నుమా ప్యాలెస్‌, మాదాపూర్‌లోని వెస్టిన్‌ హోటల్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇవాంక బస చేయనున్న వెస్టిన్‌ హోటల్‌కు నలువైపులా కిలోమీటరు దూరం వరకూ ఉన్న వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ సంస్థల యజమానులు, ప్రతినిధులతో మాదాపూర్‌ పోలీసులు సమావేశమయి ఈ ఆర్డర్‌ వేశారు.

ఇదిలా ఉంటే  ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ నెల 28న ప్రధాని మోడీ, ఇవాంక, జీఈఎస్‌ సదస్సు ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు వట్టేపల్లి, సాదిక్‌నగర్‌, ఫాతిమా నగర్‌, ఫలక్‌నుమా ప్రాంతాల్లో ఇళ్లు, మురికివాడలను పరిశీలించారు. ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేశారు. ప్రతి ఇంట్లో సభ్యులెందరు? ఏం చేస్తున్నారు? ఎవరైనా విదేశాలకు వెళ్లారా? పదిరోజుల్లో వెళ్లనున్నారా? అన్న వివరాలూ సేకరించారు. రెండు, మూడు నెలల క్రితం నుంచి అపరిచితులకు ఎవరైనా ఇల్లు అద్దెకు ఇచ్చారా? ఈ నాలుగైదు రోజుల్లో ఎవరైనా బంధువులు వచ్చారా? అన్నదీ ఆరా తీశారు. ఎవరైనా అలా వచ్చి ఉంటే.. వారి వివరాలు తీసుకున్నారు. ఇళ్లలోని వారెవరూ 28న బయటికి రావద్దని విన్నవించారు.ఆ రోజు ఇవాంక వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఈ అతిథి భ‌ద్ర‌త కాస్త అతిగా మారి త‌మ చావుకు వ‌స్తోంద‌ని ప‌లువురు బహిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు