విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారా యణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేసేందుకు కుట్ర చేస్తున్నారని.. ఏక్షణంలో అయినా.. తనను లేపేస్తారన్న భయం ఉందని ఆయన పేర్కొన్నారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను వేడుకున్నారు. ఈ క్రమంలో విశాఖ నగర పోలీసు కమిషనర్ అయ్యన్నార్‌కు ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదుతోపాటు.. విన్నపాలు అందించారు. తనకు రక్షణ కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని వీవీ లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖపట్నంలో తను బస చేసిన ప్రాంతంలోనూ .. తన ప్రచార కార్యక్రమంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు పాల్గొంటున్నారని.. వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానం ఉందని తెలిపారు. తక్షణమే తన పర్యటనలకు, తన ప్రచారానికి కూడా స్థానిక పోలీసులతో భద్రత కల్పించాలని కోరారు. తనను లేపేసేందుకు వీరు కుట్రలు చేస్తున్నార ని తెలిపారు. ఈ కుట్రలను ఛేదించాలని ఆయన కోరారు.
మూడు పేజీల తన ఫిర్యాదులో గాలి జనార్దన్ రెడ్డిపై వీవీ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాను సీబీఐ జేడీగా ఉన్న సమయంలో ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని గనుల కుంభకోణం, సరిహద్దులు దాటి.. జరిపిన అనధికార తవ్వకాలపై విచారణ చేసినట్టు వీవీ చెప్పారు. వీటిలో నిందితుడిగా తేలడంతో తాను గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరిచానన్నారు. దీంతో పక్కా ఆధారాలు సమర్పించిన దరిమిలా.. కోర్టు ఆయనకు శిక్ష వేసిందన్నారు. ఈ నేపథ్యంలో తనపై గాలి జనార్దన్ రెడ్డి కక్ష గట్టారు. ప్రస్తుతం తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నదరమిలా.. తనను చంపేయాలని కుట్రపన్నినట్టు అనుమానం ఉందన్నారు. ఈ కేసును తక్షణమే విచారించి చర్యలు తీసుకోవాలని వీవీ కమిషనర్ అయ్యన్నార్‌కు విన్నవించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates