అధికారంలోకి వ‌స్తే...బిచ్చమెత్తుకోవాల్సిందే

అధికారంలోకి వ‌స్తే...బిచ్చమెత్తుకోవాల్సిందే

 నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార ప్ర‌తిపక్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ నిర్వ‌హించిన ప్లీన‌రీలో అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించిన అనంత‌రం ఈ జోరు మ‌రింత‌గా పెరిగింది. అధికార ప‌క్షం సైతం వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని పార్టీపై దుమ్మెత్తిపోస్తోంది. తాజాగా నంద్యాల పట్టణ శివారులోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన సభకు స్థానిక మంత్రి భూమా అఖిలప్రియతో కలసి రాష్ట్ర మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. జగన్‌కు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు భిక్షాటన తప్పదని ఆరోపించారు. ఆయనకు రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టదని  మండిప‌డ్డారు.

అహంకారం, అహంభావం మూర్తీభ‌వించిన జగన్‌తో సర్దుకుపోలేకనే వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారని ఆదినారాయ‌ణ రెడ్డి అన్నారు. తాను కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరానని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై విశ్వాసంతో మంత్రి పదవి అప్పగించారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడా, అవినీతిలో కూరుకుపోయిన సీబీఐ, ఇడి కేసుల్లో ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియని జగన్ ఎక్కడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమానాగిరెడ్డి మృతి చెందిన అనంతరం శాసన సభలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన ఆశయాలను తీరుస్తానని, అఖిలప్రియను తన సొంత బిడ్డలా చూసుకుంటానని ఇచ్చిన హామీ మేరకు నేడు నంద్యాల అభివృద్ధి కోసం రూ.1100 కోట్లు మంజూరు చేసి కుప్పంతో సమానంగా నంద్యాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రులను పర్యవేక్షించేందుకు ఆదేశాలు ఇవ్వడం వల్లనే మంత్రులందరు నంద్యాలలో తిష్టవేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలను సజావుగా సాగేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. కేవలం రెండేళ్ల కాలానికి నంద్యాల ఉప ఎన్నికలో పోటీపెట్టడం జ‌గ‌న్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నంద్యాలలో ఉప ఎన్నిక చట్టబద్దంగా న్యాయంగా జరిపిస్తామని, అభివృద్ధిని చూసి భూమా బ్రహ్మానందరెడ్డిని ఆశ్వీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

నంద్యాల ఆటో నగర్ వాసులకు భూములను స్వాధీనం చేసిన ఘనత తన తండ్రి భూమానాగిరెడ్డిదేనని మంత్రి అఖిలప్రియ అన్నారు. మంత్రిగా తాను, నంద్యాలకు ప్రాతినిధ్యం వహించబోయే భూమా బ్రహ్మానందరెడ్డి కాలసి నంద్యాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయడంతోపాటు ఆటోనగర్ వాసుల చిరకాల ఆకాంక్షను నాలుగు రోజుల్లో నెరవేరుస్తామన్నారు. ఆటోనగర్ స్థలాల యజమానులకు నాలుగు రోజుల్లో వారి స్థలాలను వారికి ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేయించి సర్వ హక్కులు కల్పిస్తామని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఆటోనగర్‌లో రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపడతామని, విద్యుత్ దీపాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామన్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు తనకు, తన సోదరుడు బ్రహ్మానందరెడ్డికి తల్లిదండ్రుల్లా ఆశీర్వదించి అభివృద్ధిని చూసి ఉప ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి రంజాన్ తోఫా కింద మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి, డా.నౌమాన్‌కు ఉర్దూ అకాడమి చైర్మన్ పదవులు ఇచ్చి పార్టీకి సేవ చేసిన వారికి గౌరవం కల్పించారన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే నాటికి నంద్యాల అసెంబ్లీ పరిధిలోని ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సామాజికపరంగా, వ్యక్తిగత లబ్ధి చేకూరే విధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు