ట్రంప్ పాప కొంపముంచింది..

ట్రంప్ పాప కొంపముంచింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలే కష్టకాలంలో ఉన్నారు. ఆయన ఏ పనిచేసినా అది చినిగి చాటవుతోంది. అంతేకాదు... ఇంటర్నేషనల్ మీడియా కూడా అతనికి సంబంధించిన ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూపిస్తూ వీలైనంత డ్యామేజి చేస్తోంది. ట్రంప్ ఆ మధ్య విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు భార్య మెలానియా అతని చేతిలో చేయి వేసి నడవలేదని.. ట్రంప్ ఆమె చేతిని అందుకున్నా విదిలించి కొట్టిందని రాశారు.. రీసెంటుగా పోలాండ్ అధ్యక్షుడి భార్య ట్రంప్ చేయిచాచినా అతనితో కరచాలనం చేయలేదని రాశారు. ఇలా ట్రంప్ కు జరిగే అవమానాలు..ఆయన, ఆయన ఫ్యామిలీ వైపు నుంచి జరిగే తప్పులను మీడియా హైలైట్ చేస్తోంది. తాజాగా ట్రంప్ కూతురు ఇవాంకాను సీన్లోకి తెచ్చారు. జీ-20 సదస్సుకు ట్రంప్ తో పాటు వచ్చిన ఈ సుందరాంగి చేసిన పని ట్రంప్ కొంపముంచింది.
   
జర్మనీలోని హాంబర్గ్ లో జీ-20 సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ కోసం కేటాయించిన కుర్చీలో ఇవాంకా ట్రంప్ కూర్చోవడం, ఇతర దేశాల అధినేతలతో చర్చల్లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  జీ-20 రెండో రోజు సమావేశాల్లో భాగంగా, కీలకమైన చర్చలు జరుగుతుండగా, ట్రంప్ వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన అలా వెళ్లారో లేదో ఇవాంకా వచ్చి ఆ సీట్లో కూర్చుంది.  ఆ పక్కనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఉన్నారు. కూర్చున్నది కూర్చున్నట్లు ఉండకుండా వారిద్దరితో ఆమె ముచ్చట్లు పెట్టింది.     దీంతో దేశాధినేతల మధ్య ఆమె ఏ హోదాతో కూర్చున్నారు... ఏ హోదాతో వారితో చర్చలు జరిపారన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
  
అయితే... నేతల పరోక్షంలో వారి ప్రతినిధులు చర్చలను కొనసాగించడం సాధారణమేనని వైట్ హౌస్ అధికారులు కవరింగ్ చేస్తున్నారు. కానీ... ఏ అర్హతలూ లేని, ప్రజలతో ఎన్నుకోబడని యువతి దేశ ప్రతినిధి ఎలా అయ్యారని మళ్లీ ప్రవ్నలు మొదలయ్యాయి. దీంతో ఇవాంకా పాప చేసిన పనిని ఎలా కవర్ చేయాలో తెలియక వైట్ హౌస్ ఇరకాటంలో పడింది.
   
అయితే, ఇవాంకా అంటే పడిచచ్చే సౌందర్య పిపాసులు మాత్రం.. ట్రంప్ లేకపోతే ఏమైంది, ఇవాంకా రాకతో జీ-20 సదస్సుకే అందమొచ్చిందని సంబర పడుతున్నారట. చూడబోతే.. ఇవాంకా ఫ్యాన్సు ఆమెను ట్రంప్ ప్లేసులో ప్రెసిడెంట్ చేయమనేలా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు