యువతను నమ్ముకుంటే పనవుద్దా!

యువతను నమ్ముకుంటే పనవుద్దా!

తెలంగాణ టీడీపీ....దాదాపుగా నామమాత్రంగా మిగిలిపోయిందనే పేరును మూటగట్టుకుంటున్న సీనియర్ల సమూహారం. వరుస వైఫల్యాలతో కుదేలవుతున్న టీటీడీపీని మూలాలనుంచి బలంగా నిర్మించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించి నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్తో పాటు అచ్చంపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థి నేతలకు, యువతకు పెద్దపీట వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు మెజార్టీ టికెట్లు కూడా కేటాయించారు. ఈ ప్రక్రియ ద్వారా రెండు రకాల ప్రయోజనాలను పార్టీ అంచనా వేస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి నమ్మకాన్ని వమ్ము చేస్తూ పార్టీకి ఎలా నష్టం కలిగించారో ప్రజలకు యువత ద్వారా చెప్పించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో యువత ఆలోచనలు ఉత్తేజపూరితంగా ఉంటాయి కాబట్టి రాజకీయాల్లో కూడా పారదర్శకంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయనేది టీడీపీ అధిష్ఠానం నమ్మకంగా కనిపిస్తోంది.

అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలంటే యువతను రంగంలోకి దించాల్సిందేనని తెలంగాణ తెలుగుదేశం కసరత్తు చేసింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పార్టీ నేతలు మకాం వేసి యువతకు టికెట్లు కేటాయించే అంశంపై లోతుగా అధ్యయనం చేయడం కూడా ఇందులో భాగమేనని చెప్తున్నారు. తెలుగుదేశం వ్యూహం ప్రకారం యువమంత్రం కలిసివచ్చి మంచి ఫలితాలు వస్తే తెలంగాణ టీడీపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు