తెలంగాణ తమ్ముళ్లకు నెల నెలా జీతం

తెలంగాణ తమ్ముళ్లకు నెల నెలా జీతం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం కొరకరాని కొయ్యగా మారిన శాఖ. కీలక రాష్ట్రంలో టీడీపీకి జీవం పోసేందుకు బాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారా? ఈ క్రమంలో అతి పెద్ద రిస్క్‌కు సిద్ధపడ్డారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఒక ఆంగ్ల దినపత్రిక రాసిన కథనం ప్రకారం తెలంగాణలోని తెలుగుతమ్ముళ్లకు నెలనెలా జీతం ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైపోయిందట.

నెలకు రూ.5వేల నుంచి మొదలయ్యే ఈ వేతనాలను రూ. 40 వేల వరకు ఇవ్వనున్నారు. ఆయా నాయకుల స్థాయి ఆధారంగా ఈ వేతనాలు ఇవ్వనున్నారు. గ్రామ, మండలస్థాయి నేతకు నెలకు రూ.5,000 నుంచి 7వేల వరకు ఇచ్చే అవకాశం ఉందట. జిల్లా నాయకుడికి రూ. 10, 000 రాష్ట్ర స్థాయి నాయకుడికి నెలకు రూ.20,000 చొప్పున ఇవ్వనున్నారట. పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా, అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న నాయకులకు నెలకు రూ.40,000 ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నారని ఆ కథనం తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలు కొందరు నెలనెలా జీతాల మాదిరిగా సొమ్ములు తీసుకుంటున్నారని పేర్కొంది.

తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్న డబ్బులు 73 కోట్లు అని గత మహానాడులో ప్రకటించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని... నాయకులకు ఇచ్చే సొమ్ములను లెక్కిస్తే..సగటున ఆయా స్థాయి నాయకులను ముగ్గురు చొప్పున లెక్కేసుకుంటే...పార్టీ దగ్గర ఉన్న డబ్బు 3 నెలలకి సరిపోతుందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ విషయాలు పక్కనపెడితే ఈ వార్త కథనమే నిజమైతే...రెండు అభిప్రాయాలు తప్పకుండా కలుగుతాయి. ఒకటి చంద్రబాబు ఆండ్‌ టీం అవినీతి చేయడం ద్వారానే ఈ రకంగా సొమ్ములు సమకూర్చుకుంటున్నారని ప్రతిపక్షాలు తప్పకుండా ఆరోపిస్తాయి. అదే సమయంలో పార్టీని కాపాడుకునేందుకు ఆఖరికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చిందని ఎద్దేవా చేసే అవకాశం కూడా ఉంది. ఏదిఏమైనా...ఈ వార్తాకథనంపై టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు