ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ రూపంలో బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్ తిన్న విజయ్ దేవరకొండకు దాని ఫలితం అంత సులభంగా జీర్ణం కాదు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో విపరీతంగా ప్రమోషన్లలో పాల్గొన్నాడు. దర్శకుడు పరశురామ్ మీద పెట్టుకున్న నమ్మకం నిలువునా నీరుగారిపోయింది. ఇది చాలదన్నట్టు కేవలం 21 రోజులకే ఓటిటిలో వచ్చేయడం మరింత నెగటివిటీని తీసుకొచ్చింది. సరే ఎలాగూ థియేటర్లలో చూసినవాళ్లు తక్కువ కాబట్టి ఇప్పుడేమైనా మెరుగైన స్పందన వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం విజయ్ సితార బ్యానర్లో గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో అసలు పాటలే ఉండవని, సీరియస్ జానర్ లో కేవలం నేపధ్య సంగీతం మీద నెరేషన్ ఉంటుందనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీ ఖైదీ తరహాలో ఆలోచన మంచిదే కానీ అనిరుద్ రవిచందర్ లాంటి క్రేజీ టెక్నీషియన్ ని పెట్టుకుని ఇలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సరిపెట్టడం వెనుక కొన్ని రిస్కులు ఉంటాయి. వాటిలో మొదటిది మ్యూజిక్ రైట్స్ అమ్ముడుపోయే ఛాన్స్ ఉండదు. ఒకవేళ పాటలు ఉంటే వాటిని మంచి రేట్లకు కంపెనీలు పోటీపడి కొంటాయి. కానీ ఇప్పుడా అవకాశం ఉండదు. కనీసం నాలుగైదు సాంగ్స్ ఉంటే మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఇది నిజమో కాదో కానీ ఫ్యాన్స్ మాధ్య పెద్ద చర్చకే దారి తీసింది. ఫలితాల సంగతి ఎలా ఉన్నా లైగర్ ఒక్కటి మినహాయించి విజయ్ దేవరకొండ సినిమాలు పాటల పరంగా మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. అలాంటిది ఇప్పుడవి లేవు అంటే ట్విస్టే. దర్శకుడు గౌతమ్ తిన్నవూరి అంత డెప్త్ గా ఎలాంటి డ్రామాని చెప్పబోతున్నాడో చూడాలి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రౌడీ హీరో స్పై తరహా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడనే టాక్ ఉంది. కెరీర్ లో మొదటిసారి లవర్ బాయ్ వేషాలకు పూర్తి దూరంగా చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.