చైతూ.. సురేష్‌కు బావ అట..

చైతూ.. సురేష్‌కు బావ అట..

అక్కినేని నాగచైతన్య పేరెత్తితే చాలు.. దగ్గుబాటి కుటుంబంలో అందరూ ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతారు. అతను సురేష్, వెంకటేష్‌ల సోదరి లక్ష్మికి, అక్కినేని నాగార్జునకు కలిగిన సంతానం. తల్లిదండ్రులిద్దరూ విడిపోతే.. రామానాయుడి కుటుంబంలోనే అతను పెరిగాడు. అందరూ కలిసి అతణ్ని అల్లారుముద్దుగా పెంచారు. సురేష్ అయినా, వెంకీ అయినా తమ మేనల్లుడి గురించి మాట్లాడుతున్నపుడు ఎమోషనల్ అయిపోతుంటారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సురేష్ అలాగే తన మేనల్లుడి గురించి మాట్లాడుతూ.. అతడితో తనకు, తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చైతూను తాను బావ అని పిలిచేవాడినని సురేష్ వెల్లడించాడు. ఇందుకు కారణమేంటో కూడా ఆయన చెప్పాడు.

"మా సోదరి ఒక్కగానొక్క కొడుకు చైతన్య. వాడు చిన్నపుడు చాలా బొద్దుగా ఇంకా అందంగా ఉండేవాడు. వాడిని మేమందరం ముద్దు చేసేవాళ్లం. వాడితో కలిసి నేను గోలీలు ఆడుకున్న రోజులు ఇంకా గుర్తే. నాకు మా పిల్లలందరూ ఒక్కటే. నీకు ఎంతమంది పిల్లలంటే ఎనిమిది మంది అని చెబుతా. ఆ ఎనిమిది మందీ నాకు సమానమే. చైతూతో చిన్నప్పట్నుంచి అనుబంధం ఎక్కువే. రానాని చైతూ బావా అని పిలుస్తాడు. నేను వాణ్ని బావా అని పిలిచేవాడిని. మొన్నటి వరకు ఆ పిలుపుతోనే సంబోధించేవాడిని. ఈ మధ్యే చైతూ అంటున్నా. రానా, చైతూ కలిసి పెరిగారు. వాళ్లిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది" అని సురేష్ తెలిపాడు.

మరోవైపు తన చిన్న కొడుకు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేయడం గురించి సురేష్ మాట్లాడుతూ.. అతను ప్రస్తుతం ముంబయిలో నట శిక్షణ పొందుతున్నాడని.. తనతో సినిమా చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని.. ముంబయి నుంచి వచ్చాక తను ఎంత నేర్చుకున్నాాడో.. ఏమేం వచ్చో చూసి ఆ తర్వాత సినిమా గురించి ఒక నిర్ణయానికి వస్తామని సురేష్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English