ఇళయరాజా మనసు పెట్టే సినిమానే అన్నమాట

ఇళయరాజా మనసు పెట్టే సినిమానే అన్నమాట

మ్యాస్ట్రో ఇళయరాజాతో సంగీతం చేయించుకోవడాన్ని ఒక కలగా.. పెద్ద గౌరవంగా భావిస్తారు దర్శకులు. ఇప్పటికీ ఈ భావన చాలామంది దర్శకుల్లో ఉంది. ఇళయరాజా పనైపోయిందని ఏ దశలోనూ అనుకోవడానికి వీల్లేదు. ఇప్పటికీ ఆయన మనసు పెట్టి సంగీతం చేశాడంటే సంగీత ప్రియులు మైమరిచిపోతారు. తమిళంలో గత కొన్నేళ్లలో ఆయన నుంచి గొప్ప ఆల్బమ్స్ వచ్చాయి.

దర్శకుడికి అభిరుచి ఉండి.. లోతైన భావోద్వేగాలు ఉన్న సినిమా తీస్తే రాజా ఎలాంటి సంగీతం అందిస్తాడు అనడానికి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ లాంటి సినిమాలు ఉదాహరణ. ఇళయరాజా పనైపోయింది, ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ పాటలు ఇవ్వలేడు అనేవాళ్లకు ఆ సినిమాతో ఆయన సమాధానం చెప్పాడు. గత కొన్నేళ్లలో ఆయన తెలుగులో చేసిన సినిమాలు తక్కువ. వాటిలో కూడా మనసు పెట్టి చేసిన సినిమాలు ఇంకా తక్కువ. శ్రీరామ రాజ్యం, రుద్రమదేవి లాంటి ఒకట్రెండు సినిమాలు మాత్రమే కనిపిస్తాయి.

ఐతే ఇప్పుడు తెలుగులో కొంత విరామం తర్వాత ఇళయరాజా ఒక స్పెషల్ మూవీ ఒప్పుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగమార్తాండ’కు మ్యాస్ట్రో సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం మరాఠీ క్లాసిక్ ‘నట సామ్రాట్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌ దారుణంగా దెబ్బ తిన్న సమయంలో కృష్ణవంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ పుంజుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు.

తన ఆప్త మిత్రుడు, ఫేవరెట్ నటుడు ప్రకాష్ రాజ్‌ను హీరోగా పెట్టి.. తన భార్య రమ్యకృష్ణను ఆయనకు జోడీగా పెట్టి సినిమా తీస్తున్నాడు. బలమైన కథ కావడం.. సంగీతానికి మంచి స్కోప్ ఉండటం.. పైగా లెజెండరీ స్టేటస్ ఉన్న నటీనటులు, దర్శకుడు సినిమా చేస్తుండటంతో ఇళయరాజా సంగీతం అందించడానికి ఒప్పుకున్నట్లున్నాడు. మరి రాజా మనసు పెట్టి చేసే అవకాశమున్న నేపథ్యంలో ఈ సినిమా సంగీతం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English