వైసీపీకి మ‌రో చిక్కు..  ఈసీ సీరియ‌స్ అయితే క‌ష్ట‌మే

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నికల్లో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియా అయినా.. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా ప్ర‌క‌ట‌న వ్య‌వ‌హారం గుదిబండ‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ లోగోను వినియోగిస్తుండ‌డం వివాదానికి దారి తీసింది.

దీనిపై నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వైసీపీ నేత‌లు, పార్టీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో.. ఎంసీఎంసీ లోగోలు ఉన్నా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇస్తున్న ప్ర‌చారాలు.. ప్ర‌భుత్వ‌మే ఇస్తున్న‌ట్టుగా పేర్కొంటున్న‌ట్టు అయింద‌న్నారు.

దీని ఖ‌ర్చు రూ.కోట్ల‌లో ఉంటుంద‌ని.. మ‌రి దానిని ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా?  లేక‌.. వైసీపీ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా? అనేది తేలాల్సి ఉంద‌న్నారు. దీనిపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుని వైసీపీ నుంచి ఆ ఖ‌ర్చును రాబ‌ట్ట‌డంతోపాటు.. ఎంసీఎంసీ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంపై ప్ర‌భుత్వానికి జ‌రిమానా విధించాల‌ని.. సంబంధిత అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేయాల‌ని కోరారు. దీంతో ఈ వ్య‌వ‌హారం కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు వివాదంగా మారింది. మ‌రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.