నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా మూడు సార్లు మంత్రి. కానీ రెండు దశాబ్దాలుగా ఓటమి తప్ప గెలుపు బాట పట్టడం లేదు. ఈ సారి పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టాలని చూసినా అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో ఈసారి గెలుపు ఆయనకు అనివార్యంగా మారడంతో ఆఖరి అస్త్రాన్ని బయటకు తీశాడు. అదే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాడు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1994 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచి చంద్రబాబు మంత్రి వర్గంలో ఏకంగా ఐదు శాఖలకు మంత్రిగా పనిచేశాడు. 1999లో గెలిచి రెండో సారి మంత్రి అయ్యాడు.
2004, 2009లలో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో, 2014, 2019లలో కాకాణి గోవర్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 2014లో ఓడినా ఆయనను ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు మంత్రిగా తీసుకున్నారు. అయినా 2019లో ఓటమి తప్పలేదు. నాలుగు ఓటముల నేపథ్యంలో ఈసారి ఆయన కోడలు శృతికి టికెట్ ఇవ్వాలని భావించారు. కాకలు తీరిన కాకాణిని ఢీకొట్టడం ఆమెతో కాదని చివరికి సోమిరెడ్డికే టికెట్ ఇచ్చారు.
రెండు దశాబ్దాల వరస ఓటముల నేపథ్యంలో ఆయన ప్రజలపై సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు. దయచేసి నాకు మద్దతిచ్చి గెలిపించండి’ అని సోమిరెడ్డి వేడుకుంటున్నారు. పార్టీని వీడిన నేతల ఇళ్లకు వెళ్లి తనకు సహకరించాలని కోరుకుంటున్నారు. మరి ఆయన సెంటిమెంట్ సర్వేపల్లి జనం కరిగిపోతారా ? వేచిచూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates