షాకింగ్‌.. 'జూనియ‌ర్ బాల‌కృష్ణ‌' గోకుల్ మృతి

షాకింగ్‌.. 'జూనియ‌ర్ బాల‌కృష్ణ‌' గోకుల్ మృతి

ఇది మాట‌ల‌కంద‌ని విషాదం. చిన్న వ‌య‌సులోనే సెల‌బ్రెటీ స్టేట‌స్ అందుకున్న ఓ పిల్లాడు అనూహ్యంగా ప్రాణాలు వ‌దిలాడు. జూనియ‌ర్ బాల‌కృష్ణ‌గా గుర్తింపు పొందిన గోకుల్ డెంగీ కార‌ణంగా మృతి చెందాడు. యూట్యూబ్‌లోకి వెళ్లి జూనియ‌ర్ బాల‌కృష్ణ అని కొడితే చాలు.. ఈ పిల్లాడి వీడియోలు బోలెడు ద‌ర్శ‌న‌మిస్తాయి. బాల‌య్య హిట్ డైలాగుల్ని అల‌వోక‌గా.. ఆశ్చ‌ర్య‌పోయే హావ‌భావాలు.. మాడ్యులేష‌న్‌తో చెప్పి అబ్బుర పరుస్తాడీ పిల్లాడు.

అయిదారేళ్ల వ‌య‌సుకే అత‌ను బాల‌య్య డైలాగుల‌తో పాపుల‌ర్ అయ్యాడు. కొన్ని టీవీ షోల్లో కూడా పాల్గొని బాల‌య్య వేషాల‌తో, డైలాగుల‌తో అల‌రించాడు గోకుల్. ఒక సంద‌ర్భంలో బాల‌య్య‌ను కూడా అత‌ను క‌లిశాడు. అత‌డి ప్ర‌తిభ‌కు మెచ్చి త‌న ప‌ట్ల అభిమానం చూసి బాల‌య్య కూడా అభినందించాడు. ఫొటో దిగాడు.

ఐతే గోకుల్ డెంగీ కార‌ణంగా మృతిచెందాడ‌నే వార్త ఇప్పుడు అంద‌రినీ శోక‌సంద్రంలో ముంచెత్తింది. అత‌డి మృతి గురించి సోష‌ల్ మీడియాలో చాలామంది సెల‌బ్రెటీలు స్పందించారు. మంచు మ‌నోజ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్, ప్ర‌దీప్ మాచిరాజు, ర‌ష్మి గౌత‌మ్ త‌దిత‌రులు గోకుల్ మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తూ ట్వీట్లు చేశారు. గోకుల్ మృతితో క‌దిలిపోయిన నంద‌మూరి బాల‌కృష్ణ ఒక ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు.

తానంటే ప్రాణం ఇచ్చే గోకుల్ ఇక లేడ‌న్న వార్త తెలిసి తీవ్రంగా క‌ల‌త చెందాన‌ని.. అత‌ను డైలాగులు ప‌లికే విధానం చూసి ఎంతో ముచ్చ‌ట‌ప‌డ్డాన‌ని.. ఎంతో భ‌విష్య‌త్ ఉంద‌నుకున్న చిన్నారి జీవితం ఇలా ముగిసిపోతుంద‌నుకోలేద‌ని బాల‌య్య అన్నాడు.  చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన గోకుల్‌కు కొన్ని రోజుల కింద‌ట జ్వ‌రం వ‌చ్చింది. త‌ర్వాత అది డెంగీ అని తేలింది. బెంగ‌ళూరుకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫ‌లితం లేక అత‌ను గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన‌ట్లు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English