చిరు అంకితభావం.. తేజ మాటల్లో

చిరు అంకితభావం.. తేజ మాటల్లో

మెగాస్టార్ చిరంజీవి కేవలం పెద్ద స్టార్ అయ్యాడు కాబట్టి ఆయన్ని అందరూ గౌరవించరు. ఆ స్థానానికి చేరుకోవడానికి ఆయన పడ్డ కష్టమేంటో అందరికీ బాగా తెలుసు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకెంత శ్రమించాడో.. ఎంత ఎదిగినా కూడా ఎలా ఒదిగి ఉన్నాడో కూడా ఎరుగుదురు కాబట్టే చిరును ఇప్పటికి ఇండస్ట్రీ జనాలతో పాటు ప్రేక్షకులకు కూడా అమితంగా అభిమానిస్తారు. గౌరవిస్తారు.

64 ఏళ్ల వయసులో ఆయన ఎంతో కష్టపడి, అంకితభావంతో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేశాడు. ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఇదే సందర్భంలో చిరు ఒకప్పుడు తాను పని చేసిన ఒక సినిమా సందర్భంగా చూపించిన కమిట్మెంట్ గురించి సీనియర్ దర్శకుడు తేజ వివరించాడు.

మంగళవారం హైదరాబాద్‌లో ఒక ఫిలిం స్కూల్ సర్టిఫికెట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి మరో దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు తేజ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నటులకు ఉండాల్సిన అంకితభావం గురించి వివరిస్తూ చిరుకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పాడు.

తాను చిరు నటించిన ఒక సినిమాకు కెమెరామన్‌గా పని చేశానని.. ఒక సన్నివేశంలో చిరు కంటిన్యుయస్‌గా కొంత దూరం పరుగెత్తాలని.. అక్కడ లైటింగ్ తక్కువగా ఉండటంతో 20 రిఫ్లెక్టర్లు పెట్టామని.. సన్నివేశం పూర్తవగానే డైరెక్టర్ షాట్ ఓకే అన్నాడని.. కానీ చిరు మాత్రం వన్ మోర్ అన్నాడని తేజ చెప్పాడు. ఎందుకని అడిగితే.. తాను పరుగెత్తుతున్నపుడు ఒక రిఫ్లెక్టర్ దగ్గర వేడి తగ్గిందని చెప్పారని.. చెక్ చేస్తే అది పని చేయలేదని తెలిసిందని.. అది పని చేయనపుడు తన మీదికి సరిగా వెలుగు పడి ఉండదనే కారణంతో కష్టమైనప్పటికీ మరో టేక్ చేయడానికి చిరు రెడీ అయ్యాడని.. అదీ ఆయన అంకితభావం అని తేజ గుర్తు చేసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English