అతను డిజాస్టర్ ఇచ్చాడు.. ఇతను హ్యాండిచ్చాడు

అతను డిజాస్టర్ ఇచ్చాడు.. ఇతను హ్యాండిచ్చాడు

ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? సరైన సమయంలో సరైన సినిమాలు చేయకపోతే.. ప్లానింగ్ సరిగా లేకుంటే కెరీర్ దెబ్బ తినేస్తుంది. ఇందుకు దేవా కట్టా అనే దర్శకుడే ఉదాహరణ. 'వెన్నెల' లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత 'ప్రస్థానం' లాంటి గొప్ప సినిమా తీసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు దేవా.

అతడి ప్రతిభకు మెచ్చి 'బాహుబలి' సినిమాలో ఓ కీలక సన్నివేశంలో సంభాషణలు రాయించాడు దర్శక ధీరుడు రాజమౌళి. కానీ 'ఆటోనగర్ సూర్య' అనే ఒక సినిమా అతడి తలరాతను మార్చేసింది. దాని దెబ్బ నుంచి దేవా ఇంకా కోలుకోలేదు. కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉండి 'డైనమైట్' తీస్తే అది తుస్సుమంది. మళ్లీ గ్యాప్ తీసుకుని ఇప్పుడు హిందీలో 'ప్రస్థానం' రీమేక్ చేస్తే అదీ చీదేసింది. హిందీ 'ప్రస్థానం' తీస్తుండగానే తెలుగులో సాయిధరమ్ తేజ్‌తో సినిమా కోసం ప్రయత్నాలు చేశాడు దేవా.

దాదాపుగా ఈ సినిమా ఓకే అయినట్లే అని.. 'ప్రస్థానం' పని ముగియగానే తెలుగులో తేజుతో సినిమాను దేవా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని తేలిపోయింది. 'ప్రస్థానం' పెద్ద డిజాస్టర్ కావడంతో దేవా మీద నమ్మకం కుదరలేదో ఏమో.. తేజు కానీ, ఈ సినిమా తీద్దామన్న నిర్మాత కానీ ముందుకు రాలేదు. దేవాకు హ్యాండిచ్చిన తేజు.. దీని స్థానంలో సుబ్బు అనే కొత్త దర్శకుడితో 'సోలో బతుకే సో బెటర్' అనే సినిమాను లైన్లో పెట్టాడు తేజు.

సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించబోయే ఈ చిత్రానికి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇక దేవా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అయినా తేజు మీద ఆశలు వదులుకోకుండా 'సోలో బతుకే సో బెటర్' సినిమాకు విషెస్ చెప్పి అతడితో తాను టచ్‌లో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు దేవా. మరి ఈ సినిమా తర్వాతైనా తేజు అతడికి ఛాన్సిస్తాడా?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English